అజిత్ పవార్ బీజేపీలో చేరితే కూటమి నుంచి వైదొలుగుతాం
ఎన్సీపీ నేత అజిత్ పవార్ పార్టీ నేతలతో కలిసి బీజేపీలో చేరితే, మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలో భాగం కాదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ హెచ్చరించారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీతో అధికారాన్ని పంచుకుంటున్న శివసేన, అజిత్ పవార్ విషయంలో ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీతో వెళ్లే అవకాశం లేదని శిర్సత్ చెప్పారు. ఎన్సీపీతో కలిసి ఉండటాన్ని ప్రజలు ఇష్టపడనుందునే తాము బయటకు వచ్చామన్న ఆయన, బీజేపీ ఒకవేళ ఎన్సీపీతో కలిస్తే… తాము ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఎన్సీపీ నుంచి బయటకు వస్తున్నట్టు అజిత్ పవార్ ఇప్పటి వరకు చెప్పలేదని ఆయన అన్నారు. శివసేన, కాంగ్రెస్-ఎన్‌సీపీతో కలిసి మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో భాగమైన ఉండటం ప్రజలకు ఇష్టం లేనందునే బయటకు వచ్చామని ఆయన చెప్పారు. అజిత్ పవార్‌కు అక్కడ స్వేచ్ఛ లేదని పార్టీని వీడితే ఆయనను శివసేనలోకి స్వాగతిస్తామన్నారు. అజిత్ పవార్ అసంతృప్తికి కారణం ఆయన తనయుడు పార్థ్ పవార్ అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోవడమేనని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌తో ఆయన అసంతృప్తికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మావల్ నియోజకవర్గం నుంచి పార్థ్ పవార్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అధికార ప్రతినిధిగా శిర్సత్ ఇటీవల నియమితులయ్యారు.