Home Page SliderNational

వామ్మో ఎండాకాలం.. మళ్లీ పెరుగుతున్న కరోనా, ఒక్కరోజులో 10 వేల కేసులు

దేశంలో ఈరోజు 10,158 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 30 శాతం ఎక్కువ నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. నిన్న ఒక్కరోజులో నమోదైన ఇన్ఫెక్షన్ల సంఖ్య 7,830. కరోనా ప్రబలిన తర్వాత, దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,42,10,127. రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా నమోదు కాగా, వారం వారీ పాజిటివిటీ రేటు 4.02 శాతంగా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా COVID-19 రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతం.

భారతదేశంలో కోవిడ్ స్థానిక వ్యాప్తితో ప్రబలుతోందని… రాబోయే 10-12 రోజులలో కేసులు పెరుగే అవకాశం ఉందని… ఆ తర్వాత వ్యాధి తగ్గడం మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Omicron XBB.1.16 సబ్‌వేరియంట్, తాజాగా కేసులు పెరగడానికి కారణమవుతోంది. దీని వల్ల ఆందోళన పడాల్సిన పనిలేదని… టీకాలు వైరస్‌ను ప్రభావవంతంగా నిరోధించగలుగుతున్నాయని… ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. సబ్‌వేరియంట్ ప్రాబల్యం ఫిబ్రవరిలో 21.6% నుండి మార్చిలో 35.8%కి పెరిగింది. అయితే తాజా వేరియంట్ వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి గానీ, మరణిస్తున్న దాఖలాలు గానీ ఏమీ లేవని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనా మూడేళ్ల క్రితం వ్యాప్తి చెందడం మొదలుపెట్టిన నాటి నుంచి ఇండియాలో ఎండా కాలం విజృంభించడాన్ని చూశాం. వాస్తవానికి చల్లగాలికి కరోనా ప్రబలుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ.. దేశంలో మాత్రం కరోనా సమ్మర్‌లో ప్రభావం చూపెడుతోంది.