సూరత్‌లో కాంగ్రెస్ ‘శక్తి ప్రదర్శన’ కాదు – భక్తి ప్రదర్శన
సూరత్‌లో ఎక్కడ చూసినా రాహుల్ గాంధీకి అనుకూలంగా కాంగ్రెస్ నేతల హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరే ఉంటుందెందుకో ‘ అన్న రాహుల్ వ్యాఖ్యలపై సూరత్ కోర్టులో కేసు నమోదు కావడం, అతనికి రెండేళ్ల జైలు శిక్ష పడడం, బెయిల్ పొందడం , ఎంపీగా అనర్హత వేటు పడడం వంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. రాహుల్ గాంధీ ఈ జడ్జిమెంట్‌పై సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయబోతున్నారు. . రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతలంతా న్యాయపోరాటం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే సహా సూరత్ కోర్టు వద్ద హాజరవుతున్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటికే రాహుల్‌కు అండగా నిలబడ్డారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు.

ఊరంతా హోర్డింగులు, పోస్టర్లతో బల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. దీనితో రాహుల్ గాంధీ అప్పీల్ చేయబోతున్నారా? లేక న్యాయవ్యవస్థపై దాడి చేయబోతున్నారా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రముఖులు కోర్టుకు రావాల్సిన అవసరం ఏముందని, వారి పార్టీ బల ప్రదర్శన చూపించుకోవడానికే అని విమర్శిస్తున్నారు. మరో నాలుగు గంటల్లో కోర్టులో విచారణ మొదలు కాబోతోంది. ఈ రోజు రాహుల్‌కు ఊరట లభిస్తుందా? లేక చుక్కెదురవుతుందా? అనే విషయంపై అందరూ చర్చిస్తున్నారు. మరోపక్క ‘మోదీ’ ఇంటిపేరు గల ఓబిసీ కమ్యూనిటీ ప్రజలను అవమానించిన రాహుల్ గాంధీ తన వాదనను ఏవిధంగా సమర్థించుకుంటారని బీజేపీ ప్రశ్నిస్తోంది.

