వైఎస్ఆర్సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి ఎవరికి ?
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్సార్సీపీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని గత రెండు రోజుల క్రితం పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేశారు. దీంతో అదే రోజు ఉదయగిరి కి ఇన్చార్జిని నియమించాలని వైఎస్ఆర్సిపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అప్పటినుంచి కసరత్తులు కూడా ప్రారంభించింది. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు పేర్లను గత మూడు రోజులుగా పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై సీఎం జగన్ ముఖ్యనేతలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇన్చార్జిగా నియమించబోతున్న వారే వచ్చే ఎన్నికల్లో దాదాపుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీలో ఉంటారు.

ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఇన్చార్జి విషయంలో అన్ని కోణాల్లో పరిశీలిస్తోంది. దీంతో ఉదయగిరి ఇన్చార్జి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. గతంలో వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు ఇన్చార్జి నియమించే సమయంలో ఒకరిద్దరు మాత్రమే ఆ పదవి కోసం పోటీ పడినప్పటికి ఉదయగిరి నియోజకవర్గానికి మాత్రం అందుకు భిన్నంగా బలమైన నాయకులు ఇంచార్జ్ పగ్గాల కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఒకరిద్దరికి గతంలో సీఎం జగన్ ఏదో ఒక ప్రాంతంలో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి వెంకటగిరి టికెట్ ఇస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే వెంకటగిరిలో చోటు చేసుకున్న రాజకీయ సంఘటనలతో స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి దూరమయ్యాక అక్కడ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి పగ్గాలు ఇచ్చారు. దీంతో ప్రత్యామ్నాయంగా ధనుంజయ రెడ్డికి మరో నియోజకవర్గంలో అవకాశం కల్పించాలని సీఎం జగన్ యోచిస్తూ ఆ దిశగానే ఉదయగిరి పరిశీలకుడుగా నియమించారు.

వచ్చే ఎన్నికల్లో ధనుంజయ రెడ్డి ఉదయగిరి అభ్యర్థి అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మేకపాటి సస్పెన్షన్‌తో ఉదయగిరిలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగాయి. పరిశీలకుడుగా ఉన్న ధనుంజయ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఉదయగిరి పగ్గాల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరి పేరు ఖరారు చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అలాగే మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డిలు నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురిలో ఒకరిని ఇన్చార్జిగా వైయస్సార్సీపి అధిష్టానం నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.