నేను క్రిస్టియన్.. కానీ నాకు హిందుమతమంటే మక్కువ.. సుప్రీం కోర్టు జస్టిస్ జోసెఫ్ వెల్లడి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ మాట్లాడుతూ తాను క్రిస్టియన్ అయినప్పటికీ హిందూమతం అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ జోసెఫ్, దేశంలోని పురాతన, సాంస్కృతిక, మతపరమైన ప్రదేశాల “అసలు” పేర్లను పునరుద్ధరించడానికి పేరు మార్చే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. నేను క్రైస్తవుడ్నే… ఇప్పటికీ నాకు హిందూమతం అంటే చాలా అభిమానం, ఇది గొప్ప మతం, చిన్నచూపు చూడకూడదు. ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీతలో హిందూ మతం సాధించిన, ప్రస్తావించబడిన ఔన్నత్యం ఏ వ్యవస్థలోనూ అసమానమైనది. ఈ గొప్ప మతం గురించి మనం గర్వపడాలి, దానిని కించపరచకూడదన్నారు. మన గొప్పతనం గురించి మనం గర్వపడాలిస మన గొప్పతనం మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. నేను దానిని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు హిందూ మతం తత్వాలపై డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ పుస్తకాన్ని కూడా చదవండి. కేరళలో అనేక మంది రాజులు భూమిని దానం చేశారు.” న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పిల్ వ్యాజ్యాన్ని కొట్టివేసిన ధర్మాసనం, భారతదేశం లౌకిక దేశమని పేర్కొంది. రోడ్ల పేరు పెట్టడానికి మతపరమైన ఆరాధనకు ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ జోసెఫ్ ఎత్తి చూపారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని సృష్టించడానికి ప్రయత్నించారని అన్నారు.

