తెలుగుదేశం పార్టీలోకి కన్నా లక్ష్మీనారాయణ
• పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం
• ఆదివారం అనుచర వర్గంతో సమావేశమైన కన్నా
• ఈ నెల 23న సైకిల్ ఎక్కుతారని ప్రచారం
ఏపీలో సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి రాజీనామాకు ముందే తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో చర్చల ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వరుసగా తన అనుచర వర్గంతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి ఆఫర్ ఉందని అనుచర వర్గం చెబుతుంది. తొలుత జనసేనలోకి వెళ్లాలని భావించిన కొన్ని ప్రత్యేక కారణాలతో తెలుగుదేశం పార్టీలోకి కన్నా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. కొత్తగా ఏ పార్టీలో చేరాలనే అంశం పైన చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. తారకరత్న మరణం కారణంగా నిర్ణయాలు ఏవీ ప్రకటించుకుండానే సమావేశం ముగించారు. నందమూరి తారకరత్న మరణం పట్ల కన్నా సంతాపం ప్రకటించారు. ఒక మంచి నటుడిని కోల్పోయామని బాధను వ్యక్తం చేశారు. మిగిలిన రాజకీయ అంశాలు వెల్లడించడానికి ఆసక్తి చూపించలేదు.

కానీ కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు కనిపించడం ఆయన అదే పార్టీలో చేరతారన్నదానికి సంకేతంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీని వీడాలని నిర్ణయించిన తర్వాత తొలుత జనసేనతో కన్నా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీతో ఇంకా జనసేన పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరటమే మంచి నిర్ణయం అనే ఆలోచనలకు కన్నా వచ్చినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ పై అసంతృప్తిగా ఉన్న కన్నా కోసం కొద్ది రోజుల క్రితం మనోహర్‌తో పవన్ కళ్యాణ్ రాయబారం నడిపారు. ఆ భేటీలో పవన్‌కు అండగా ఉంటానని కూడా కన్నా ప్రకటించారు. అయితే రాజకీయ పరిణామాలు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపే కన్నా మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వస్తే సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా సత్తెనపల్లి నుంచి పోటీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కన్నా లక్ష్మీనారాయణ గతంలో పెదకూరపాడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు జిల్లా నుంచి సీనియర్ మంత్రిగా వ్యవహరించారు. 2014 ,2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఆయనకు రెండు సీట్ల పైన చర్చ జరుగుతుంది. సత్తెనపల్లి నుంచి కన్నా నిలబడే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో పొత్తు కుదిరితే తెలుగుదేశం పార్టీకి జనసేనకు సీట్ల పంపకాలకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అనుచరులు మాట్లాడుకుంటున్నారు.