మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూశారు. వైజాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉంగుటూరు నుంచి 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగానూ, పర్యాటక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కనీసం మీడియాలోనూ ఆయన కన్పించలేదు. సున్నిత స్వభావం కలిగిన వసంత్ కుమార్ అంటే మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి అమితాభిమానం. ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ… జిల్లా రాజకీయాలతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఎప్పుడూ ఎవరిని నిందించే తత్వం వసంత్ కుమార్‌ది కాదని కాంగ్రెస్ నాయకులు ఆయనను గుర్తు చేసుకుంటారు.


