ఐరోపాలో హీట్‌డోమ్-విచిత్ర వేసవికాలం
ఈమధ్య కాలంలో భూగోళంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఐరోపాలో చలికాలం ఉండవలసిన ఈ సమయంలో వేసవితాపం మొదలయ్యింది. వేడి ఆవిర్లు ఏర్పడి హీట్‌డోమ్స్ ఏర్పడుతున్నాయి. ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాలకు కొత్త సంవత్సరం ప్రారంభంలో విదేశాల నుండి పర్యాటకుల సందడి మొదలవుతుంది. పర్వతాలపైన పేరుకున్న మంచులో స్కీయింగ్ ఆడడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తారు. ఈసారి కూడా అలాగే వచ్చిన పర్యాటకులకు నిరాశ ఎదురైంది. పర్వతాలపై మంచు కానరాలేదు. స్కీయింగ్ నిర్వహించేవారు కృత్తిమంగా మంచును ఏర్పాటుచేసి, సర్దుకుపోమ్మంటున్నారు.

ప్రతీ సంవత్సరం ఈ సమయానికి ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం దాదాపు 20 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ రకమైన ఉష్ణోగ్రతలపై వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి అమెరికా భారీ హిమపాతానికి గురైంది. మంచు కురవాల్సిన చోట ఎండలు మండిపోవడం, సాధారణ వాతావరణం ఉండాల్సిన చోట్లో మంచు కప్పేయడం వంటి అసాధారణ వాతావరణ స్థితులు నెలకొన్నాయి. ఈ రకమైన అనూహ్యమార్పులు భూవాతావరణంలో చోటు చేసుకుంటున్నాయి. యూరోపియన్ దేశాలు నదులు ఎండిపోయి, నీటి ఎద్దడితోనూ, ఉష్ణోగ్రతలు పెరిగి వేసవి తాపంతోనూ అల్లాడుతున్నాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్ లలో ఇలాంటి ఉష్ణోగ్రతలు గత వందేళ్లలో ఎప్పుడూ నమోదు కాలేదని చెప్తున్నారు. రష్యావైపు మాత్రం మైనస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ విచిత్ర పరిస్థితికి భూతాపమే కారణం కావచ్చు.

