Andhra PradeshHome Page Slider

అవునంటే కాదనిలే.. కాదనంటే అవుననిలే…!

అవునంటే కాదనిలే.. కాదనంటే అవుననిలే.. రాజకీయ నేతల మాటలకు అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే.. అన్నట్టుగా ఉంది. అధికారాన్ని మరోసారి దక్కించుకోడానికి ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తుంటే.. ప్రత్యర్థులు సైతం పవర్ పాలిటిక్స్‌లో పీకల్లోతు దిగిపోయారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారంటూ ఆ పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. అటు ఏపీలోనూ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడం ఎలా అన్నదానిపై టీడీపీ, జనసేన కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయం చుట్టూ సాగుతున్న ఎత్తులు, పైఎత్తులు ఎవరిని అధికారంలోకి తీసుకొస్తాయ్.. ఎవరిని అధఃపాతాళానికి తీసుకెళ్తాయన్నదానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆలంబనగా తనదే అధికారమని.. పైపెచ్చు 175కి 175 స్థానాల్లో విజయం సాధించాలంటూ వైఎస్ జగన్ గర్జిస్తుంటే.. ఇదేం ఖర్మ రాష్ట్రానికంటూ టీడీపీ నినదిస్తోంది.

టీడీపీకి తోడుగా జనసేన సైతం ప్రజల్లో గట్టిగా గళం విన్పిస్తోంది. ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనుకుంటున్న పరిస్థితుల్లో… ఏపీకి సంబంధం లేని కొన్ని వ్యవహారాలు, ఆ రాష్ట్రంపై ప్రభావం చూపించేలా కన్పిస్తున్నాయ్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించడానికి సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నందున, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ సిచ్యువేషన్ మాత్రం అలా ఏ మాత్రం కన్పించడం లేదు. ఏపీ అంటేనే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. ఇంటి పేరును బట్టి మీరు ఏమిట్లు అని చర్చ సాగే సమాజంలో ఇప్పుడు ప్రజలు సంక్షేమ జాతరతో తడిసిముద్దవుతున్నారు. ఓవైపు పథకాలు అందుతున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలా ఓటేస్తారన్నదానిపై క్లారిటీ మాత్రం కలగడం లేదు. అందుకే టీడీపీ అధినేత ఏపీలో ఇప్పుడున్న సంక్షేమానికి మించి.. ప్రజలకు మేలు చేస్తానంటూ భరోసా ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే అటు రాజధానితోపాటు, పోలవరం, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తానంటున్నారు. నవ్యాంధ్రను అభివృద్ధికి చిరునామాగా మార్చేస్తానంటూ దీమా ప్రకటిస్తున్నారు.

ఈ తరుణంలో ఏపీ రాజకీయాలు, తెలంగాణతో ముడిపడినట్టుగా కన్పిస్తున్నాయ్. తెలంగాణలో పూర్తి స్థాయి మద్దతిస్తామని టీడీపీ, కమలనాధులకు బంపర్ ఆఫర్ ఇచ్చినా.. ఆ పార్టీ నేతలు దానిపై పెద్ద ఆసక్తి చూపించడం లేదు. అదే సమయంలో ఏపీలో పవన్ కల్యాణ్ కు దన్నుగా నిలుస్తున్న కాపు సామాజికవర్గం ఇప్పుడు ఎన్నికల్లో ఎలా రియాక్ట్ అవుతుందన్నదానిపై తర్జనభర్జన కొనసాగుతోంది. మొన్నటి వరకు పవన్ కల్యాణ్ పార్టీలో కీలకంగా ఉన్న తోట చంద్రశేఖర్ లాంటి నాయకులు, జనసేనను కాదని.. బీఆర్ఎస్ పార్టీలో చేరడం వెనుక ఏం జరిగి ఉంటుందోనన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలయ్యింది. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వస్తారని కేసీఆర్ వ్యాఖ్యానించడం వెనుక అసలు స్టోరీ వేరే ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్… ఇప్పటికే బీజేపీ నుంచి సానుకూలత లభించకపోయినా.. పవన్ కల్యాణ్ మద్దతు ఉందని భావిస్తున్న టీడీపీ… మొత్తం వ్యవహారాలు మింగునపడటం లేదు.

ఈబీసీ కోటాలోని 10 శాతంలో 5 శాతాన్ని కాపులకు, చంద్రబాబు ఇవ్వాలని చూసినా అది గ్రౌండ్ లెవల్లో మెటీరిలైజ్ కాలేదు. అదే సమయంలో కాపుల రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా సాధ్యం కావంటూ పాదయాత్రలో చెప్పిన జగన్… బీసీ ఓటర్లపైనే హోప్స్ అన్నీ పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో తోట చంద్రశేఖర్ తోపాటు, బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాపు సామాజికవర్గం నేతలు వచ్చే రోజుల్లో ఏం చేస్తారన్నదానిపైనే ఏపీలో రాజకీయాలు ఎటువైపు ఒరుగుతాయన్నది చెప్పే అవకాశం ఉంటుంది. కాకుంటే ఒక విషయంలో మాత్రం క్లారిటీ వస్తోంది. రాజకీయాలు చేయాలనుకునేవారికి ఈసారి ఆప్షన్స్ కోకొల్లలుగా కన్పిస్తున్నాయ్. వారు కాదంటే వీరు.. వీరిని కాదంటే వారు ఆప్షన్ గా ఉంటారన్నదానిలో సందేహమే లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సైతం నేతలు క్యూకడుతున్నారు. నాటి సంగతులు గుర్తు చేసుకోవడం అనవసరం.. నేటి అవసరాలే.. రేపటి రాజకీయాలంటూ చలో చలో అంటున్నారు.