Andhra PradeshHome Page Slider

ఈ నెల 8న ఏపీకి రానున్న అమిత్ షా

◆ కర్నూలు బీజేపీ సభకు హాజరు
◆ సభ సక్సెస్ పై ఏపీ నేతల దృష్టి
◆ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు అడుగులు
◆ ఎన్నికలకు సన్నద్ధతకు సిద్ధమవుతున్న బీజేపీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 8వ తేదీన ఏపీ పర్యటనకు రానున్నారు. కర్నూలు కేంద్రంగా రాయలసీమలో బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటున్నారు. ఏపీలో పార్టీ పటిష్టత రానున్న ఎన్నికలకు సన్నద్ధతపై బీజేపీ వడివడిగా అడుగులు వేస్తుంది. పార్టీ పరంగా కొన్ని జిల్లాల అధ్యక్షులు మార్చడంతో పాటు, బూత్ కమిటీల నిర్మాణం, శక్తి కేంద్రాల ఏర్పాటు ,సోషల్ మీడియా బలోపేతం, రాష్ట్రస్థాయిలో వివిధ మోర్చాల నిర్వహణ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించటం ఇలా సంస్థాగతంగా పలు చర్యలు ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చేపట్టింది. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో నిలిచిపోయిన ప్రాజెక్టులను ఉద్యమాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా పోరు, వీధి సభలు, నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ యువ సంఘర్షణ యాత్ర, దళిత సంక్షేమం కోసం నిర్దేశించిన కార్పొరేషన్ల పునరుద్ధరణకు దళితవాడల సందర్శన, గిరిజనుల సంక్షేమానికి కేంద్రం ఇస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలా అనేక కార్యక్రమాలను బీజేపీ చేపట్టి అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు సమస్యలపై భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. గత కొంతకాలంగా దీనిపై ఆలోచన చేసిన బీజేపీ పెద్దలు కేంద్రమంత్రి అమిత్‌షాతో సంప్రదింపులు చేశారు. ఎట్టకేలకు ఈనెల 8న కర్నూలులో నిర్వహించే బహిరంగ సభకు వచ్చేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అమిత్ షా సభ ముగిసే వరకు కర్నూల్లోనే బస చేయనున్నారు.