ముంచుకొస్తున్న పెను తుఫాను
◆ వాయుగుండంగా మారిన అల్పపీడనం
◆ కోస్తాంధ్రకు భారీవర్ష సూచన
◆ కళ్ళాల్లో ధాన్యం.. రైతుల్లో దైన్యం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మాండుస్ తుఫానుగా ఆంధ్ర వైపు దూసుకొస్తుండటంతో కోస్తాంధ్ర జిల్లాలోని రైతాంగం మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అది నేటి సాయంత్రానికి మాండూస్ తుఫానుగా బలపడనుందని దీని ప్రభావంతో రాబోవు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకునే సమయంలో తుఫాను దడ పుట్టిస్తుంది. ఈ సంవత్సరం పంటల పుష్కలంగా పండి దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది. కానీ ఆకస్మాత్తుగా ఏర్పడిన అల్పపీడనంతో రైతుల గుండెల్లో ఆందోళన మొదలైంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో అన్ని సహాయ చర్యలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహార్ రెడ్డి అన్ని చర్యలు తీసుకున్నారు. సహాయక శిబిరాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో పాటుగా బాధితులకు వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచారు. తుఫాను ప్రభావం ఉంటుంది అనుకుంటున్న జిల్లా కలెక్టర్లు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

