కవితను 11న విచారించనున్న సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాంగ్మూలాన్ని ఈ నెల 11వ తేదీన ఆమె ఇంట్లో నమోదు చేస్తామని సీబీఐ తెలిపింది. తొలుత 6వ తేదీన విచారణకు అంగీకరించిన కవిత.. తర్వాత ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా విచారణకు సిద్ధమని లేఖ రాసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీ, దాని ఆధారంగా సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని తనకు అందించాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే విచారణకు అంగీకరిస్తానంటూ సీబీఐకి కవిత లేఖ రాశారు. దానిపై స్పందించిన సీబీఐ అధికారులు.. వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఐఆర్ కాపీ ఉందంటూ ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చారు. దాన్ని పరిశీలించిన తర్వాత కవిత మళ్లీ సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్సకు లేఖ రాస్తూ.. ఆ ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు, అన్ని అంశాలను పరిశీలించానని.. అందులో తన పేరు ఎక్కడా లేదని పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానని.. 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఓ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తునకు సహకరిస్తానని పేర్కొన్నారు.

