News

ముందస్తు వ్యూహం ప్రకారమే మైలవరం చిచ్చు!

◆ సజ్జలతో భేటీ అయిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
◆ మైలవరం వైసీపీ అభ్యర్ధిగా బీసీ నేత జోగి రమేష్?
◆ దుమారం రేపిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు
◆ జోగి రమేష్ మైలవరం నుంచి పోటీ అంటూ అనుచరుల హడావిడి

ఏపీలోని మైలవరం నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు చిచ్చు రేపింది. మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉండి ఇపుడు అతి పెద్ద చిచ్చును రాజేశారు. ఫలితంగా తన కుమారుడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుని ఇరకాటంలో పడేశారు. ఎట్టకేలకు వైసీపీ అధిష్టానం వద్దకు మైలవరం నేతల పంచాయితీ చేరింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి జోగి రమేష్ మైలవరం నుంచి పోటీ చేస్తారంటూ ఆయన వర్గీయులు తెగ హడావుడి చేస్తున్నారు. జోగి రమేష్ తన విధులకు అడ్డుపడుతున్నారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కినుక వహించారు. ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చ రేపాయి.

ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ కు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ బుధవారం సుదీర్ఘంగా చర్చించారు. జోగి రమేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మైలవరం నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని గ్రూపులని ప్రోత్సహిస్తున్నారని పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కృష్ణ ప్రసాద్ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ దీని వల్ల వైసీపీ పని మరింత సులువు అయిందని విశ్లేషకులు అంటున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ పనితీరు ఏ మాత్రం బాలేదని ఇప్పటికే సర్వే నివేదికలు వెల్లడిస్తున్న వేళ ఆయన పరిచయాలు అన్నీ కూడా టీడీపీ గూటిలోవే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ వైసీపీ ఏం చేయాలో వసంత నాగేశ్వరావు చెప్పి మరీ దారి చూపించారు అని అంటున్నారు.

నిజానికి మైలవరంలో బీసీలు ఎక్కువ. అందువలన బీసీ నేత జోగి రమేష్‌కు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందని ప్రచారంలో ఉంది. కమ్మ సామాజిక వర్గానికి ఏపీలో గౌరవం లేదని వసంత నాగేశ్వరరావు అనడమే కాదు జగన్ మీద డైరెక్ట్ గానే కామెంట్స్ చేసారు. పైగా జగన్ వద్దనుకునే అమరావతినే బెస్ట్ రాజధాని అంటూ కితాబు ఇచ్చారు. అంతే కాకుండా బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్, నీలం సంజీవరెడ్డి వంటి వారి పేరు మీదనే ఏపీలో ఎన్నో నిర్మాణాలు ఉన్నాయని కమ్మలకు తీరని అన్యాయం ఏపీలో వైసీపీ చేస్తూంటే ఎవరూ నోరు మెదపకపోవడమేంటి అని కుల రాజకీయాన్ని చేస్తూ నిలదీశారు. మొత్తానికి వసంత నాగేశ్వరరావు ఆక్రోశం కాదు కానీ కొడుకు రాజకీయ జీవితంలో చిచ్చు పెట్టేశారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కచ్చితంగా గెలుస్తారు అనుకుంటే కృష్ణప్రసాద్ విషయంలో ఏదైనా రెండో ఆలోచన ఉండేదని ఆయన పట్ల జనంలో అసంతృప్తి ఉందని దాంతో ఈసారి టికెట్ డౌట్ అని అంటున్నారు.

ఈ క్రమంలో వసంత నాగేశ్వరరావు మా దారి వేరు అన్నట్లుగా మాట్లాడం తెలుగుదేశానికి మద్దతుగా మాట్లాడడంతో జూనియర్ వసంతకు టికెట్ గండం పొంచి ఉందని అంటున్నారు. పైగా కమ్మలను పక్కన పెట్టి బీసీలకు ఆ సీటు ఇస్తే దాన్ని గొప్పగా చెప్పుకోవచ్చని సామాజిక సమీకరణలు కూడా మైలవరంలో బాగా కుదురుతాయని వైసీపీ భావిస్తుంది. మొత్తానికి కమ్మ వారి కార్తీక సమారాధన కాదు కానీ మైలవరం సీటుకే దెబ్బేసిందంటున్నారు. ఐతే వైసీపీ పెద్దలను కలిసిన తర్వాత కృష్ణ ప్రసాద్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. నా నాయకుడి మాటే నా బాట…నా వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం అంటూ రాసుకొచ్చారు. నాయకుడి మాటే నాకు శిరోధార్యం…వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానంటూ ట్వీట్ చేశారు. మొత్తం వ్యవహారంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.