అటు జగన్.. ఇటు చంద్రబాబు.. వామ్మో స్కెచ్‌లు మామూలుగా లేవుగా..!
ఏపీలో పొలిటికల్ సునామీ
ఏడాదిన్నర ముందుగానే ప్రచారహోరు
175కి 175 టార్గెట్ అంటున్న జగన్
అసెంబ్లీకి పోవాలంటే గెలిపించండి
ఇదే చివరి ఎన్నికంటున్న చంద్రబాబు
మోదీ టూర్ తర్వాత స్తబ్దుగా పవన్ కల్యాణ్
పవన్, కింగ్ అవుతారా? కింగ్ మేకరా?
తెలంగాణ రాజకీయాల్లో వేడి అసాధారణంగా పుంజుకుంటూ.. ఒకరిపై ఒకరు దుమ్మత్తిపోసుకుంటుంటే.. ఏపీలో అందుకు భిన్నమైన రాజకీయం కన్పిస్తోంది. 175కి175 అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రూపొందించుకుంటుంటే.. వచ్చేది టీడీపీ సర్కారంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తూ ఇద్దరు అగ్రనేతలు చేస్తున్న ప్రయత్నాలు మొత్తం వ్యవహారాన్ని రసకందాయంలో పడేస్తున్నాయ్. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతలు మాట్లాడిన మాటల్లో ఎంతో పరమార్థం దాగి ఉంది. ఎవరి లెక్కలు వాళ్లేసుకుంటూ ప్రజల్లో పార్టీ ఇమేజ్‌కు డామేజ్ కలక్కుండా చూసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తామన్న విశ్వాసాన్ని అటు పార్టీలోనూ, ఇటు సమాజంలోని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి కింగ్ సీట్ కోసం హోరాహోరీ తలపడబోతుంటే.. పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అవుతారని.. అందుకు బీజేపీ సైతం వ్యూహాలు రచిస్తోందంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో హీరో అయ్యేదెవరు? జీరో అయ్యేదెవరు?

2104 ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత 2019లో తిరిగి పుంజుకున్న వైసీపీ.. భవిష్యత్‌లో తనకిక తిరుగులేకుండా చేసుకోవాలని భావిస్తోంది. ఎన్నికల్లో చెప్పినవి చెప్పినట్టుగా చేశానని చెబుతున్న.. జగన్ వైసీపీకీ వచ్చే ఎన్నికల్లో జనం తప్పనిసరిగా ఓటేస్తారని… నిత్యం పార్టీ నేతలు ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు. జాగ్రత్తగా పనిచేసుకుంటే ఏం జరుగుతుందో చెబుతూనే.. తేడా వస్తే భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా వివరిస్తున్నారు. వచ్చే ఒక్క ఎన్నికలో గెలిస్తే వచ్చే 30 ఏళ్ల పాటు అధికారంలో మనమే ఉంటామంటూ కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామన్నారు. పథకాలన్నింటినీ పారదర్శకంగా అందిస్తున్నామని.. పార్టీలతో, కులాలతో సంబంధం లేకుండా అందిస్తున్నామన్నారు. అందువల్ల 175కి175 ఎందుకురావని కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలందరూ ఒకటే లక్ష్యంతో పనిచేయాలన్నారు. అదే సమయంలో… కార్యకర్తలకు ఉపశమనంలా… ఒక్కొక్కరితో వన్ టు వన్ మాట్లాడి… వారి విజ్ఞప్తులను పరిష్కరించాల్సిందిగా సీఎంవో అధికారులకు సూచించారు. కార్యకర్తలకు సపోర్ట్ చేసినప్పుడే పార్టీ నిలబడుతోందన్న అభిప్రాయాన్ని జగన్ కలిగించారు.

ఇలా సీఎం వైఎస్ జగన్ తనదైన శైలిలో దూసుకుపోతుంటే.. తామేం తక్కువ కాదన్నట్టుగా టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. టీడీపీ గాలి వీస్తోందని… ఆ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ నేతలు ఎగిరెగిరిపడుతున్నారని… ఒక్కొక్కరి సంగతి తేలుస్తానన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనను ఎవరూ అవమానించలేదన్న చంద్రబాబు, అసెంబ్లీలో తనను, తన భార్యను తిట్టించారన్నారు. అందుకే అసెంబ్లీని బాయ్‌కాట్ చేసే నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పుడు నడుస్తున్న… అసెంబ్లీ గౌరవ సభ ఎంత మాత్రం కాదని.. అది కౌరవ సభ అన్నారు. ప్రజల్లో గెలిచాకే మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెడతానని నాడే చెప్పానన్నారు. తాను అసెంబ్లీకి పోవాలంటే… రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మళ్లీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఒకరకంగా పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు కర్తవ్యబోధ చేశారు. ఓవైపు వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇస్తూనే… ఎన్నికల్లో గెలిచాక ఒక్కొక్కరి సంగతి తేల్చుతానంటున్నారు. మొత్తంగా అటు వైసీపీని డీల్ చేస్తూనే.. ప్రజల్లో టీడీపీ మరోసారి ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు.

ఒకరేమో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతుంటే.. మరొకరు తిరిగి అధికారాన్ని పొందాలని కసితో పనిచేస్తున్నారు. అందుకు ఉన్న అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ రాకీయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న పవన్ కల్యాణ్ ఈసారి ఎలాంటి రోల్ పోషిస్తారన్నదానిపై ఉత్కంఠ కలుగుతోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యం.. అందుకు ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని పవన్ చెబుతున్నా.. బీజేపీ మాత్రం, టీడీపీ వైపు అస్సలంటే అస్సలే చూడటం లేదు. ఎన్నికల్లో గెలుపు ఓటములు ముఖ్యమే అయినా.. టీడీపీని ఏపీలో భూజానికెత్తుకోవాలని కమలదళం ఎంత మాత్రం భావించడం లేదు. ఈ తరుణంలో చంద్రబాబుతో కలిసి పనిచేయాలని భావిస్తున్న జనసేనాని వచ్చే రోజుల్లో ఎలాంటి రోల్ పోషిస్తారన్నది చాలా చాలా కీలకం. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయంటూ వార్తలు గుప్పమంటున్నాయ్. కానీ ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన ప్రభావం.. టీడీపీ-జనసేన సంబంధాలపై ఉంటుందని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఏపీలో గెలిచేవారు.. ఓటించేవారెవరన్నది తేలడానికి ముందుకు జరిగే హోరాహోరీ ఎన్నో కొత్త ప్రశ్నలను ఉదయింపజేస్తోంది.

ఏపీ రాజకీయాలు ఎవరికి చిక్కుతాయి.. ఎవరిని బోనులో నిలబెడతాయన్నదానిపై మీమాంశ నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధిస్తామని సంపూర్ణ విశ్వాసంతో ఉన్న వైఎస్ జగన్ 175కి175 అంటూ గర్జన చేస్తుంటే… వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీయేనని చంద్రబాబు కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ తీసుకునే స్టాండ్ ఏపీ రాజకీయాలను టిల్ట్ చేస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. గత ఎన్నికల్లో చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి పవన్ కల్యాణ్ తాను కింగ్ లేదా, కింగ్ మేకర్ కావాలని తలపోస్తున్నారు. ఓవైపు వైసీపీని ఓడించాలన్న లక్ష్యం కన్నా… తాను రాజకీయంగా నిలదొక్కుకోవడంపైనే ఫోకస్ పెట్టాలన్న అభిప్రాయాన్ని జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు టీడీపీతో పొత్తులో ఉంటే… ఇవి ఎలా సాధ్యమన్న కన్ఫ్యూజన్ జనసైనికుల్లోనూ ఉంది. ఓట్లు, సీట్లు అన్నీ కూడా పార్టీలు చేసే ఫీట్లను బట్టే ఫేట్ డిసైడ్ అవుతాయి. జనసేనతో పొత్తు కుదుర్చుకోవాలని టీడీపీ అధినాయకత్వం విశ్వసిస్తుంటే.. బీజేపీ మాత్రం ఆ విషయంలో సెకండ్ ఒపీనియన్‌తో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఏదైనా ఏపీపై బీజేపీ నిర్ణయం ఉండే అవకాశం ఉంది. మొన్నటి వరకు వైసీపీపై విమర్శల జోరు పెంచిన పవన్ తాజాగా… జనసేనను గెలిపించండి. మార్పు తీసుకొస్తామన్న వర్షన్లోకి వచ్చారు.