రూ.100 కోట్లు తీసుకోకుండా రిస్క్ తీసుకున్నా..
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తాను రిస్క్ తీసుకున్నానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. వాళ్లు ఇచ్చే రూ.100 కోట్లు తీసుకొని ఉంటే హ్యాపీగా ఉండేవాడినని.. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే ఇంత రిస్క్ తీసుకున్నానని చెప్పారు. తాండూరు నియోజక వర్గంలోని బషీరాబాద్ మండలం మల్కన్‌గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేయాలన్న డిమాండ్‌తో ఆ గ్రామానికి చెందిన యువకులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వారితో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. తాను తీసుకున్న రిస్క్‌ను ప్రజలు గుర్తించాలని.. గ్రామం అభివృద్ధి కోసం ఏం కావాలో పేపర్‌పై రాసి ఇవ్వాలని.. గ్రామ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని వారిని బుజ్జగించారు. దీంతో గ్రామానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారంటూ యువకులు దీక్ష విరమించుకున్నారు.

యూపీ, గుజరాత్ నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్..
కాగా.. మొయినాబాద్ ఫాంహౌస్ ఉదంతాన్ని బయటపెట్టిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావులకు గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ‘ఈ వ్యవహారాన్ని బయటపెట్టినందుకు మీ అంతు చూస్తాం’ అంటూ దుండగులు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. ఈ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం 4+4 గన్మెన్లతో భద్రతను పెంచింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా కేటాయించింది. ఫాంహౌస్ కేసుపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఆనంద్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. రోహిత్ రెడ్డికి రూ.100 కోట్లు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు చొప్పున ఇస్తామన్న డబ్బులను నిందితులు ఎక్కడి నుంచి సమకూర్చారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. నిందితులు రామచంద్ర భారత్, సోమయాజి, నందకుమార్ల వాయిస్ టెస్ట్ కూడా నిర్వహించారు.

