యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందడమెలా..?
యూట్యూబ్.. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉన్న వాళ్లంతా తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్ లేకుంటే యూట్యూబ్‌లో వెతుకుతారు. ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే గూగుల్ తర్వాత ఎక్కువ మంది చూసేది యూట్యూబ్ అంటే అతిశయోక్తి కాదు. తాజా సమాచారం.. కొత్త సినిమాల అప్డేట్.. ట్రైలర్లు.. ఆరోగ్యం.. ఆర్థికం.. రియల్ ఎస్టేట్.. సమగ్ర వీడియోలు చూసే సాధనంగా యూట్యూబ్ నిలుస్తోంది. ఏ వీడియో కావాలన్నా యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే క్షణాల్లో మన కళ్ల ముందు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూట్యూబ్ చూస్తున్నారు. ఓ సర్వే ప్రకారం.. ప్రతి ఒక్కరు సగటున రోజూ 3-5 గంటలు యూట్యూబ్‌లోనే గడుపుతున్నారు. ఇంటర్నెట్ యూజర్లు రోజూ కొన్ని కోట్ల వీడియోలను యూట్యూబ్‌లో చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా 100 కోట్ల మందికి పైగా ఆదాయం కూడా పొందుతున్నారు.

వీడియో అప్లోడ్ చేయగానే డబ్బులు రావు..
యూట్యూబ్ చానెల్ పెట్టి వీడియోలు అప్లోడ్ చేయగానే మన అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయని చాలా మంది అనుకుంటారు. కానీ.. యూట్యూబ్‌లో సంపాదించాలంటే చాలా హర్డిల్స్ అధిగమించాల్సి ఉంటుంది. యూట్యూబ్ ద్వారా ఆదాయం చాలా కారణాలతో ముడిపడి ఉంది. దీనికి సరైన లెక్కలు చెప్పడం మహా పండితులకు కూడా సాధ్యం కాలేదు. కాస్ట్ ఫర్ థౌజండ్ వ్యూస్, కాస్ట్ ఫర్ ఇంప్రెషన్.. ఇలాంటివి యూట్యూబ్ ద్వారా సంపాదించే మార్గాల్లో కీలకమైనవి. మనం ఉంటున్న దేశం.. వీడియో టైపు.. యాడ్స్ ధరలు.. యాడ్ బ్లాక్.. ఇలా చాలా ఫ్యాక్టర్స్ మన యూట్యూబ్ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సబ్స్క్రైబర్లు.. వ్యూస్ కీలకం..
యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించే ప్రధాన మార్గం పార్టనర్ ప్రోగ్రామ్. అంటే.. మనం అప్లోడ్ చేసే వీడియో ప్లే అయ్యే ముందు వచ్చే 5-10 సెకన్ల యాడ్స్ ద్వారా మనకు ఆదాయం వస్తుంది. అయితే.. ఈ యాడ్స్ మీ వీడియోలో ప్లే కావాలంటే ముందు మీ చానల్‌ను మోనిటైజ్ చేసుకోవాలి. ఒరిజినల్ వీడియోను అప్లోడ్ చేస్తేనే యాడ్స్ ప్లే అవుతాయి. కాపీరైట్ కంటెంట్‌ను అప్లోడ్ చేస్తే యాడ్స్ వెంటనే నిలిచిపోతాయి. మీ వీడియోలకు వచ్చే ట్రాఫిక్ (వీక్షించే వాళ్లు)ను బట్టి ఆదాయం వస్తుంది. ఉదాహరణకు ఒక యాడ్‌కు ప్రకటనదారులు గూగుల్‌కు 100 డాలర్లు చెల్లిస్తే.. గూగుల్ 45 డాలర్లు తీసుకొని మనకు 55 డాలర్లు ఇస్తుంది. అయితే.. మన ఛానెల్‌కు కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి. మీ అన్ని వీడియోలకు కలిపి ఏడాదిలో కనీసం 4 వేల గంటల వ్యూస్ ఉండాలి. అంటే.. ప్రజలకు ఆసక్తి కలిగించే వీడియోలు పెడితే వ్యూస్ పెరుగుతాయి. మనం ఈ టార్గెట్‌ను చేరుకున్న తర్వాత తమ వీడియోలకు యాడ్స్ ప్లే చేసేందుకు అప్లై చేసుకోవచ్చు. దీని కోసం గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్‌ను ఉచితంగానే క్రియేట్ చేసుకోవచ్చు.

సొంత ఆదాయం
మన యూట్యూబ్ ఛానెల్ పాపులారిటీ సంపాదిస్తే.. అంటే రెగ్యులర్‌గా ఎక్కువ మంది వీక్షిస్తూ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద సంస్థలు మనకు నేరుగా యాడ్ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తాయి. తమ బ్రాండ్ యాడ్స్‌ను మన యూట్యూబ్ ఛానెల్స్‌లో పెట్టినందుకు నిర్ణీత మొత్తం కూడా చెల్లిస్తాయి. ఈ ఆదాయంతో యూట్యూబ్ లేదా గూగుల్‌కు సంబంధం ఉండదు. ఇలాంటి స్పాన్సర్డ్ వీడియోల ద్వారా ఒక్కో యాడ్‌కు 400-2000 డాలర్ల వరకు ఆదాయం లభిస్తుంది. పూర్తిగా యూట్యూబ్‌పైనే ఆధారపడే వాళ్లకు ఈ ఆదాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.