InternationalNews

ఫేస్‌బుక్‌కు ఆదాయం ఎలా..? ఉద్యోగులపై వేటు ఎందుకు..?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా. తమ సంస్థ నుంచి 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సంచలన ప్రకటన చేశారు. అంటే.. దాదాపు 87 వేల మంది ఉద్యోగులతో అమెరికాలోనే 6వ అతిపెద్ద కంపెనీ అయిన మెటా 13 శాతం ఉద్యోగులపై వేటు వేసింది. 2004లో ఫేస్‌బుక్‌ను స్థాపించిన తర్వాత ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో ఫేస్‌బుక్‌ సహా పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అసలు ఫేస్‌బుక్‌ ఇంతగా భయపటానికి కారణమేంటి..? ఆ కంపెనీ ఆదాయ మార్గాలేంటి..? ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉంది..?

ఫేస్‌బుక్‌ ప్రధాన ఆదాయం ప్రకటనలే..

ఫేస్‌బుక్‌ తన ఆదాయాన్ని ప్రధానంగా ప్రకటనల ద్వారానే సమకూర్చుకుంటుంది. తన వెబ్‌సైట్‌, యాప్‌లో ప్రకటనలు పెడుతూ వివిధ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. ఫేస్‌బుక్‌ వాడుతున్న కోట్లాది మంది ఈ ప్రకటనలు చూసి వినియోగదారులుగా మారే అవకాశం ఉంటుందన్న ఆశతో వివిధ కంపెనీలు ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. ఫేస్‌బుక్‌ను దాదాపు 291 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వారి సాయంతో ఫేస్‌బుక్‌ 2020లో ఏకంగా 6.38 లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇందులో ప్రకటనల వాటానే 98 శాతం ఉంది. అమెరికా, కెనడా నుంచే 45 శాతం ఆదాయం వచ్చింది. మిగిలిన 55 శాతం ఆదాయం ఇతర దేశాల నుంచి వచ్చింది. భారత్‌ నుంచి ఫేస్‌బుక్‌ 2020లో 9 వేల కోట్ల రూపాయలు ఆర్జించింది.

సామాజిక మాధ్యమాలను తగ్గించిన ప్రజలు..

కరోనా కాలంలోనూ ఐటీ కంపెనీలు దూసుకెళ్లాయి. లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో కంప్యూటర్లు, సెల్‌ఫోన్లలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలనే ఎక్కువగా చూశారు. అందుకే.. వాటికి డిమాండ్‌ పెరగడంతో భారీ స్థాయిలో కొత్త నియామకాలు చేపట్టాయి. ఇప్పుడు వృత్తి, వ్యాపారాల్లో మునిగిపోయిన ప్రజలు సామాజిక మాధ్యమాల్లో సమయం కేటాయించడాన్ని తగ్గించారు. దీంతో ఆయా సంస్థలకు ప్రజల ఆదరణ తగ్గడంతో ప్రకటనల ఆదాయం భారీగా పడిపోయింది. మెటా సంస్థ గత త్రైమాసిక ఆదాయాన్ని తన సంస్థ చరిత్రలోనే అతి తక్కువగా నమోదు చేసింది. అమెరికాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్లే సామాజిక మాధ్యమాలపై ప్రజలు దృష్టి తగ్గించారని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

భారీగా పడిపోయిన మెటా షేర్‌ విలువ..

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడైన మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఏకంగా 11 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను కోల్పోయారు. జుకర్‌ బర్గ్‌ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లను భారీ స్థాయిలో కోల్పోయారు. బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ కూడా 9 లక్షల మందికి పైగా ఫాలోవర్లను కోల్పోయానని.. 9 వేల మంది మాత్రమే మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్‌ఫోన్లకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన ‘మెటావర్స్‌’ అనే వర్చువల్‌ రియాల్టీపై జుకర్‌ బర్గ్‌ 10 బిలియన్‌ డాలర్ల (రూ.82 వేల కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టారు. ఆర్థిక మాంద్యం కారణంగా మెటా సంస్థకు రెవెన్యూ తగ్గిపోయింది. ఒకానొక దశలో 380 డాలర్లకు ఎగబాకిన మెటా షేర్‌ విలువ గతేడాది ఏకంగా 100.55 డాలర్లకు పడిపోయింది.

తగ్గిన ఆదాయం.. ఉద్యోగులను తొలగింపు

మెటా కంపెనీ ఈ ఏడాదిలోనే 677 బిలియన్‌ డాలర్లు అంటే 55 లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయింది. దీంతో కంపెనీ పరిస్థితి 6 నుంచి 26వ స్థానానికి దిగజారింది. ఆ సంస్థ షేర్‌ కొనుక్కున్న ఇన్వెస్టర్లు 10 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. జుకర్‌ బర్గ్‌ ఒక్కడే ఏకంగా 30 బిలియన్‌ డాలర్లు అంటే 2 లక్షల కోట్లకు పైగా సంపదను పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన సంపద కరుగుతూ వచ్చింది. 2020లో 102 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద సంపన్నుడిగా నిలిచిన జుకర్‌ బర్గ్‌ ఆస్తి ప్రస్తుతం 37.7 డాలర్లకు పడిపోయింది. ఫలితంగా ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో జుకర్‌ బర్గ్‌ 29వ స్థానానికి పడిపోయారు. మెటా లాభాలు ఏకంగా 50 శాతం పడిపోయాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడం మెటా సంస్థకు అనివార్యమైంది. నిర్వహణ ఖర్చులు తగ్గించినా ఆశించిన ఫలితం రాలేదు. మెటా సంస్థ చేస్తున్న ఖర్చులో ఉద్యోగులకే 55 శాతం చెల్లిస్తున్నారు. దీంతో ఉద్యోగులను తొలగించడం అనివార్యమైందని జుకర్‌ బర్గ్‌ చెప్పారు.