జ్ఞానవాపి కేసులో సుప్రీం కీలక ఉత్తర్వులు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మే నెలలో వారణాసి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ ప్రార్థన స్థలంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి, మత పరమైన ఆచారాలు పాటించడానికి అనుమతినిచ్చింది. ఈ అంశానికి సంబంధించి వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. మరోవైపు జ్ఞానవాపి మసీదు సముదాయంలోని శృంగార గౌరి విగ్రహానికి పూజలు నిర్వహించే అంశంపై 5గురు హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై ఈ నెల 8న విచారణ చేపట్టిన వారణాసి కోర్టు తదుపరి విచారణను నవంబరు 14కి వాయిదా వేసింది.