NewsTelangana

బెంగళూరు- చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

దక్షిణాదిలో తొలి సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ

బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న… కెఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో చెన్నై-మైసూరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో ఐదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్. దక్షిణ భారతదేశంలో మొదటి రైలు. ఇది పారిశ్రామిక కేంద్రమైన చెన్నై, బెంగళూరులోని టెక్… స్టార్టప్ హబ్, ప్రసిద్ధ పర్యాటక నగరం మైసూరు మధ్య కనెక్టివిటీని మరింతగా మెరుగుపరుస్తుందని PMO తెలిపింది.

KSR రైల్వే స్టేషన్‌లో భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటక ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ కలిసి కర్ణాటక నుండి వారణాసికి యాత్రికులను పంపేందుకు కృషి చేస్తున్న భారత్ గౌరవ్ పథకం కింద ఈ రైలును తీసుకున్న మొదటి రాష్ట్రం కర్ణాటక. కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను సందర్శించడానికి యాత్రికులు సౌకర్యవంతమైన బస, పర్యాటకులకు మార్గదర్శనం కలగనుంది.

అంతకు ముందు బెంగళూరులోని విధానసౌధలో కవి కనకదాసు, వాల్మీకి మహర్షి విగ్రహాలకు ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని మోదీ ప్రారంభించారు. మధ్యాహ్నం విమానాశ్రయంలో 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు, తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.