InternationalNews

ఆర్థిక మాంద్యం అంటే ఏంటి..? ఎలా బయటపడాలి

మాంద్యం అంటే నెమ్మదించడం లేదా సుదీర్ఘ కాలంగా అదే స్థితిలో ఉండిపోవడం. ఏదైనా దేశ ఆర్థిక అభివృద్ధి సుదీర్ఘకాలంగా నెమ్మదించినా లేదా వృద్ధి రేటు పడిపోయినా ఆర్థిక మాంద్యం వచ్చిందంటారు. దేశ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంగా తీవ్రమైన తగ్గుదల కనిపిస్తే ఆర్థిక మాంద్యంలోకి వెళ్లామంటారు. ఎక్కువ కాలం పాటు చిన్న చిన్న ఆర్థిక మందగమనాలు కొనసాగినా ఆర్థిక మాంద్యం వచ్చినట్లే. ఆర్థిక మాంద్యం ఎప్పుడొచ్చినా 3-4 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో నిజ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 10 శాతం మేర పడిపోతుంది. ఆర్థిక మాంద్యం వల్ల ప్రధానంగా ప్రజల్లో నిరుద్యోగం, పేదరికం తాండవిస్తుంది.

మాంద్యంలో అన్నీ కుంటుపడతాయి..

మాంద్యం సమయంలో ఆర్థిక కార్యకలాపాల్లో వృద్ధి ఒక్కసారిగా క్షీణిస్తుంది. దేశంలో ఉత్పత్తి కుంటుబడి ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. మాంద్యంలో ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ధైర్యం చేయరు. వ్యక్తులు, సంస్థలకు రుణాలు అందవు. పరిశ్రమలు, సేవా రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పడిపోతుంది. రాష్ట్రాలు, కేంద్రం అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుంది. వర్తకం, వాణిజ్యం కుంటుపడుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం కూడా దెబ్బతింటుంది. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలతాయి. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతారు. కరెన్సీ విలువ క్షీణిస్తుంది. ఆస్తుల విలువ భారీగా పడిపోతుంది. డబ్బుల్లేకపోవడంతో కొనేవాళ్లు లేక కొన్ని వస్తువులకు డిమాండ్‌ పడిపోతుంది. నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం అదుపులేకుండా పెరుగుతాయి. సామాన్యులు బతకడానికే కష్టపడుతుంటే డబ్బులున్న వాళ్లు డబ్బును దాచేసి బ్లాక్‌మనీని పెంచుకుంటారు.

స్టాగ్‌ఫ్లేషన్‌ అంటే ఏమిటి..?

స్థూల దేశీయొత్పత్తి వరుసగా రెండు త్రైమాసికాలు తగ్గితే ఆర్థిక మాంద్యంగా ప్రకటిస్తారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని.. మాంద్యం చుట్టుముట్టే ప్రమాదాన్ని జీడీపీ ఆధారంగా చెబుతారు. ఆర్థిక మాంద్యానికి ప్రారంభ దశను స్టాగ్‌ఫ్లేషన్‌ అంటారు. అంటే.. ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతే మాంద్యం అని.. తగ్గడం లేదా పెరగడం లేకుండా స్థబ్ధుగా ఉంటూ వృద్ధిరేటు సున్నగా నమోదైతే స్టాగ్‌ఫ్లేషన్‌ అని అంటారు.

మాంద్యం నుంచి బయట పడాలంటే..

ఆర్థిక మాంద్యం నుంచి బయట పడాలంటే దేశాలు తొలుత పెట్టుబడులు పెంచాలి. అప్పుడు ఉపాధి లభించి నిరుద్యోగం తగ్గుతుంది. ఫలితంగా ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయి. వారి కొనుగోలు శక్తి పెరిగి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. పెద్ద కంపెనీలపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించి.. సామాన్య ప్రజలపై పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించాలి. దీంతో సామాన్య ప్రజల చేతిలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బును వాళ్లు మళ్లీ మార్కెట్‌లో ఖర్చు చేస్తే దేశ వృద్ధి రేటు పెరుగుతుంది.