NationalNews

త్వరలో ఇండియాకు నీరవ్ మోదీ… అప్పగింతకు మార్గం సుగమం

లండన్ కోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును 11 వేల కోట్లకు బురిడీ కొట్టించిన నీవర్ మోదీని ఇండియాకు తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమవుతోంది. తనను ఇండియాకు పంపించొద్దంటూ నీరవ్ మోదీ వేసిన పిటిషన్‌ ఇవాళ లండన్ కోర్టు ముందుకు వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించిన భారీ మోసం కేసులో విచారణను ఎదుర్కొనేందుకు భారత్‌కు తిరిగి పంపడాన్ని వ్యతిరేకిస్తూ 51 ఏళ్ల మోదీ విజ్ఞప్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐతే ఈ రోజు లండన్ హైకోర్టులో అప్పీల్‌ను కోల్పోయాడు. దీంతో బ్యాంకులను మోసం చేసి… భారతదేశం నుండి పారిపోయిన గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని UK నుండి ఇండియాకి రప్పించడటానికి మార్గం సుగమమవుతోంది.

ఈ ఏడాది ప్రారంభంలో అప్పీల్‌ను విచారించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేలు, పరారీలో ఉన్న వ్యాపారవేత్తను భారతదేశానికి అప్పగించడానికి అనుమతించే తీర్పును వెలువరించారు. మోదీ మానసిక పరిస్థితి, ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉన్నందున ఆయనను అప్పగించడం… అన్యాయమని… అణచివేతకు గురిచేస్తోందన్న వాదనతో తాము ఏకీభవించడం లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఐతే మోదీని లండన్ నుండి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తీసుకురావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్న అతని మేనమామ మెహుల్ చోక్సీ కూడా PNBని మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన్ను కూడా అరెస్టు చేయాలని భారతీయ విచారణ సంస్థలు కోరుతున్నాయి.