ప్రజల్ని గొర్రెలు అనుకుంటున్న కేసీఆర్
సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతూ.. వాటిని ప్రజలు నమ్ముతారని భావిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. 2014లో, 2018లో రెండుసార్లు అధికారమిచ్చినా కేసీఆర్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయలేదని.. గజ్వేల్ ముఖ్యమంత్రిగా మాత్రమే వ్యవహరించారని దుయ్యబట్టారు. కేసీఆర్ను నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారని ఆవేదన చెందారు. చండూరులో జరిగిన వడ్డెర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. తెలంగాణ ప్రజల విశ్వసనీయతను కేసీఆర్ కోల్పోయారని.. ఆయన మాటలు ఎవరూ నమ్మబోరని తెలిపారు. రాష్ట్రానికి సీబీఐ రావొద్దంటూ జీవో ఇచ్చిన కేసీఆర్కు రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేదా..? అని ప్రశనించారు.

లెఫ్ట్ పార్టీలను బొంద పెట్టాలన్న కేసీఆర్ చండూరులో ఇద్దరు వామపక్ష నాయకులను అటు, ఇటు కూర్చోబెట్టుకున్నంత మాత్రాన కమ్యూనిస్టుల ఓట్లు పడతాయనుకోవడం భ్రమ అన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను బానిసలుగా కేసీఆర్ మార్చారని.. మందు పోసే స్థాయికి వాళ్లను దిగజార్చడం బాధాకరమన్నారు. శ్రీకాంతా చారి వంటి త్యాగధనుల పునాదులపై ఏర్పడిన తెలంగాణాలో కేసీఆర్ కుటుంబం మాత్రమే సొంత విమానం కొనుక్కునే స్థాయికి ఎదిగిందని.. తెలంగాణ ప్రజలు మాత్రం బాగుపడలేదని ఆరోపించారు. ఈ కష్టాలు పోవాలంటే కేసీఆర్ పాలన పోవాలని.. రాజగోపాల్ రెడ్డి గెలుపుతోనే కేసీఆర్ నియంతృత్వ పాలన అంతమవుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.