ఏపీలో కీలకంగా మారిన కాపునేతల భేటీ
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన కాపు ముఖ్య నేతలు రాజమండ్రిలో కీలకమైన సమావేశం నిర్వహించటం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలోనూ కాపు నేతల భేటిపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొనడంతో భవిష్యత్తులో పార్టీకి మరింత అండగా నిలిచే కార్యాచరణ కూడా రూపొందించడాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం మద్దతును మరింత కూడగట్టుకునే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు లో కూడా ఇదే అంశంపై చర్చ నడుస్తుంది. గత రెండు రోజుల క్రితం తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన పాత తరం నేతలు సమావేశం కావటం 24 గంటల్లోనే వైసీపీకి చెందిన కాపు నేతలు రాజమండ్రి వేదికగా భేటీ కావడం చూస్తుంటే రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మలుపు తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

తాజాగా రాజమండ్రి లో జరిగిన కాపు నేతల భేటీలో తీసుకున్న మూడు తీర్మానాలు అత్యంత కీలకమైనవి. ఈ తీర్మానాల్లో విజయవాడ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పదవులు లో ఉన్న కాపు నేతలతో కలిసి త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నది మొదటి తీర్మానంగా ఉంది. ఇక రెండో తీర్మానంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కాపుల కోసం చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసే విధంగా చేయాలని నిర్ణయించారు. మూడోదిగా సీనియర్ కాపు నేతలతో చర్చించి భవిష్యత్తులో కాపులకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందించేలా తీర్మానించారు. అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాల్లో కాపుల రిజర్వేషన్ అంశం కీలకమైనదిగానే చెప్పుకోవాలి. దీనిపై వాస్తవాలను వక్రీకరించి లేనిపోని ఆశలు అపోహలు కల్పించడం సీఎం జగన్ కు ఇష్టం లేదని అందుకే రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా ఎంతవరకు చేయగలమో చేస్తామని ఆయన చెప్పారని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వాలు కాపులను కేవలం ఓటు బ్యాంకు గానే చూశాయని, చంద్రబాబు నాయుడు కాపులను అణిచివేశారని, వైయస్ జగన్ కాపుల శ్రేయోభిలాషి అని పలువురు మంత్రులు సమావేశంలో వ్యాఖ్యానించారు.

