రౌడీలు రాజ్యాలు ఏలకూడదు పవన్ కళ్యాణ్
అక్రమ కేసులకు భయపడేది లేదని నిర్బంధాలకు వెరవబోమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం మారాలంటే ప్రజాస్వామ్య పంథాలో సమిష్టిగా చేసే బలమైన పోరాటాలే సరైన మార్గమని అన్నారు. రౌడీలు రాజ్యమేల కూడదన్నదే జనసేన లక్ష్యం అని చెప్పారు. విశాఖ అక్రమ కేసుల్లో జైలు పాలై హైకోర్టు ఇచ్చిన బైలుతో విడుదలైన 9 మంది జనసేన నాయకులు వారి కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పిల్లలకు మంచి చదువు ఇవ్వగలను, డబ్బులు ఇవ్వగలను, మంచి ఇల్లు, బట్టలు వారికి కావాల్సిన సౌకర్యాలు ఇచ్చే అవకాశం ఉందని కానీ వారు బతికేందుకు మంచి సమాజాన్ని తీసుకురావాలంటే నేనేం చేయాలి అన్న ఆలోచన నన్ను రాజకీయల వైపు నడిపించిందని అన్నారు. తన ఒక్కడి వల్లనే అద్భుతాలు జరిగిపోతాయి అంటే నమ్మనని మంచి ఆలోచనలతో కూడిన బలమైన సమూహం తయారు చేసేందుకు జనసేన పార్టీని వేదికగా నిర్మించానని అన్నారు. జనవాణి కార్యక్రమంలో వేల సమస్యలు తన ముందుకు వచ్చాయని ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలు బయటకు వచ్చాయని ఒక దళిత యువకుడ్ని అరెస్టు చేశారని నిబంధనల ప్రకారం వ్యవహరించాలి కాని అతనికి శిరోమండనం చేయించే అధికారం ఈ వ్యవస్థకు ఎక్కడిదని ప్రశ్నించారు.

అన్యాయంగా కేసులు ఇరికించిన నాయకులు బయటకు రాకుంటే పార్టీ తరఫున జైల్ బరో చేయాలని భావించామని పవన్ చెప్పారు. ఎలాంటి నేరం చేయకున్నా నాయకులను ఇళ్లల్లోకి వెళ్లి మరీ పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని, బస చేసిన నోవాటెల్ హోటల్ లోకి వచ్చి మరీ దౌర్జన్యం చేశారని న్యాయవ్యవస్థ పై పార్టీకి ఉన్న నమ్మకం మనల్ని గెలిపించిందని అన్నారు. కచ్చితంగా అక్రమంగా పెట్టిన కేసులు నుంచి కూడా బయటకు వస్తామని ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచిన రాష్ట్రంలోని జనసేనికులందరికి అలాగే జైలుకు వెళ్లిన నాయకుల కుటుంబ సభ్యులకు మనస్పూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. వారు మనో ధైర్యంతో ఉండటం అభినందనీయమన్నారు.