NewsTelangana

ఆదివాసీలతో రాహుల్‌ నృత్యం.. పాదయాత్రలో పూనమ్‌ కౌర్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తెలంగాణాలో ప్రశాంతంగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య హాట్‌హాట్‌గా నడుస్తున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ వివాదంతో నిమిత్తం లేకుండా స్థానికులతో కలిసి నృత్యాలు చేస్తూ.. విద్యావంతులతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా, ఉల్లాసంగా రాహుల్‌ గాంధీ ముందుకు వెళ్తున్నారు. భద్రాచలం నుంచి వచ్చిన ఆదివాసీ మహిళలతో కలిసి శనివారం ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో గుస్సాడీ నృత్యం చేశారు. కొమ్ముకోయ కళాకారులతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, రాహుల్‌ గాంధీ వేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆదివాసీల కళారూపం గురించి రాహుల్‌కు భట్టి వివరించారు.

కదం కదం కలిపిన పూనమ్‌ కౌర్‌

ధర్మాపూర్‌లోని జయప్రకాశ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర జడ్చర్ల వరకు 20 కిలోమీటర్లు కొనసాగుతుంది. సినీ నటి పూనమ్‌ కౌర్‌ కూడా రాహుల్‌తో కలిసి నడిచారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌, ఏఐసీసీ సభ్యుడు జైరాం రమేష్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మధుయాష్కీ గౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. దారి పొడవునా యువకులు, చిన్నారులు, మహిళలు, కళాకారులు, వివిధ సంఘాల నేతలు, కార్మికులతో రాహుల్‌ ముచ్చటించారు. చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 3 వేల మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు తమ సమస్యలను రాహుల్‌కు వివరించారు.