పరాగ్, విజయలకు మస్క్ భారీ పరిహారం..
ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు హస్తగతం చేసుకున్న టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ తొలి వేటు ట్విట్టర్‌లోని నలుగురు కీలక ఉద్యోగులపై వేశారు. భారత సంతతికి చెందిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెలతో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్‌లను తొలగించారు. ట్విట్టర్‌తో ఒప్పందం కుదుర్చుకొని తర్వాత కొనేందుకు ససేమిరా అన్న మస్క్‌ను ట్విట్టర్ కోర్టుకు ఈడ్చి సంస్థను కొనేట్లు చేయడంలో ఈ నలుగురే కీలకంగా వ్యవహరించారని.. అందుకే వాళ్లపై మస్క్ కక్ష కట్టారని సమాచారం. అయితే.. తొలగించినందుకు వీళ్లకు మస్క్ ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందో తెలుసా..?

విజయకు రూ.120 కోట్లు..
ట్విట్టర్లో లీగల్ హెడ్‌గా ఉన్న విజయ గద్దెను తొలగిస్తే రూ.120 కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 1974లో హైదరాబాద్‌లో పుట్టిన విజయకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లిపోయింది. కార్నెల్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న విజయ తొలుత విల్సన్ సోన్సినీ గుడ్రిచ్ అండ్ రోసాటి లా ఫర్మ్‌లో పదేళ్ల పాటు పనిచేశారు. అమెరికన్ అటార్నీ, జనరల్ కౌన్సెల్ కూడా అయిన విజయ 2011లో ట్విట్టర్లో చేరారు. ఒక్కో అడుగు ఎక్కుతూ ఆ సంస్థలో లీగల్, పాలసీ, ట్రస్ట్ హెడ్ విభాగాధిపతి స్థాయికి చేరుకున్నారు. ద్వేషపూరిత ప్రకటనలు, ట్వీట్లు, వేధింపులు, తప్పుడు సమాచారం, విద్వేష స్పీచ్‌లను ట్విట్టర్ నియంత్రించడంలో ఆమె బాధ్యత కీలకం. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేయడంలో విజయ ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి నుంచే ఆమెపై మస్క్ కక్ష కట్టారు.

గత ఏడాది నవంబరులో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన పరాగ్ అగర్వాల్‌ను ఏడాదిలోపు తొలగిస్తే దాదాపు 320 కోట్ల పరిహారం చెల్లించాలి. రాజస్థాన్‌లో 1984లో జన్మించిన పరాగ్ అగర్వాల్ తండ్రి ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీలో సీనియర్ అధికారి. తల్లి ముంబైలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యారు. ముంబైలో బీటెక్ చేసిన పరాగ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ అందుకున్నారు. 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ప్రమోషన్ పొందారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేసి నవంబరులో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ట్విట్టర్లో నకిలీ అకౌంట్లు, స్పామ్ అకౌంట్లపై పరాగ్ తప్పుడు సమాచారం ఇచ్చారని మస్క్ కక్ష కట్టారు. ఈ కారణం వల్లే కొనుగోలు ఒప్పందం నుంచి వెనకడుగు వేశారు. ట్విట్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ సంస్థను కొనాల్సి చేయాల్సి వచ్చింది.

ట్రంప్ ట్విట్టర్ ఖాతా తెరుస్తారా..?
ట్విట్టర్ సీఈవోగా తానే బాధ్యతలు చేపట్టాలని ఎలాన్ మస్క్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్‌లకు కూడా సీఈవో అవుతారని వార్తలందుతున్నాయి. అయితే.. ట్విట్టర్లో విద్వేష ప్రసంగాలు, ప్రకటనల కారణంగా నిషేధానికి గురైన ఖాతాలను మస్క్ మళ్లీ తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను కూడా తెరిచే సూచనలున్నాయి.