Telangana

రాహుల్‌ గాంధీ పాదయాత్ర మళ్లీ ప్రారంభం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తెలంగాణాలో గురువారం మళ్లీ ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న రాహుల్‌ మక్తల్‌ శివారులోని సబ్‌స్టేషన్‌ నుంచి పాదయాత్రను ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభించారు. మక్తల్‌ పెద్ద చెరువులో చేప పిల్లల్ని వదిలి నడక ప్రారంభించారు. పత్తి చేనులో పని చేస్తున్న కూలీలతో మాట్లాడారు. ఈ రోజు 26 కిలోమీటర్ల మేర కొనసాగే పాదయాత్ర సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 2 గంటల 30 నిమిషాలకు తెలంగాణ రైతులతో రాహుల్‌ సమావేశమవుతారు.

లల

గురువారం నాటి పాయాత్ర మక్తల్‌ నుంచి కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్‌, దండు క్రాస్‌ రోడ్డుల మీదుగా కచ్వర్‌ గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత జక్లేర్‌ క్లార్‌ రోడ్డు మీదుగా గుడిగండ్ల గ్రామానికి చేరుతుంది. అక్కడ ఓ సభలో ప్రసంగించి ఎలిగండ్ల వద్ద రాత్రి బస చేస్తారు. పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్మికులు, నారాయణ పేట జిల్లాకు చెందిన బీడీ కార్మికులతో కలిసి రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగించేలా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళిక రచించింది. రాహుల్‌ వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు మాణిక్యం ఠాకూర్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తదితర నాయకులు ఉన్నారు.