NewsTelangana

మునుగోడులో ధర్మం గెలవాలి.. అధర్మం ఓడాలి..!

మునుగోడులో బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. నాంపల్లి మండలం కేతేపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల తీరుపై నిప్పులు చెరిగారు. పండుగ రోజు మంగళహారతులతో స్వాగతం పలికిన ఆడిబిడ్డల స్ఫూర్తిని ఎన్నిటికీ మరచిపోలేనన్నారు. కలియుగం మనిషి.. మనిషిని ప్రేమించలేని యుగమన్న ఈటల… మనిషి మనిషిని మోసం చేసుకుని బతికే యుగమన్నారు. మనిషి పట్ల ప్రేమ, పరస్పర అభిమానం తప్పదని కరోనా రుజువు చేసిందన్నారు.

ప్రజలు మద్యం, డబ్బుకు లొంగరని తేలిపోయిందన్నారు. కోట్ల ఆస్తులున్నా ఎందుకు కొరగావని… ప్రకృతి మాత్రమే రక్షణ ఇస్తుందన్నారు. గొర్రెల మీద తోడేళ్లు దాడి చేసినట్టు నాడు హుజూరాబాద్ పై దాడి చేశారని.. ఇప్పుడు మునుగోడుకు వచ్చారన్నారు ఈటల. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు. కొరివితో నెత్తిగొక్కుని కేసీఆర్ ఆగమాగమయ్యాడన్నారు. నిధులు రావడం లేదని చెప్తే.. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే వస్తాయని.. రాజగోపాల్ రెడ్డికి చెప్పానన్న ఈటల… అందుకు ఆయన సై అన్నారన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీయాలని ప్రజలకు ఈటల పిలుపునిచ్చారు.

అంతరాత్మ సాక్షిగా ఆలోచన చేసి ధర్మానికి ఓటేయాలన్నారు. ఎందులో తెలంగాణ నెంబర్ వన్నో కేసీఆర్ చెప్పాలన్నారు. తాగుడులోనా, తాపించి చంపడంలోనా, బంగారు తెలంగాణ అంటే తాగిపించి చంపడమా, బంగారు తెలంగాణ అంటే భర్తలు లేని భార్యలా, తల్లిలేని పిల్లలా, అప్పులు కుప్ప బంగారు తెలంగాణ అవుతుందా అంటూ ఈటల ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే కేసీఆర్ పాలన అంతమవుతుందన్నారు. తింటాం, తాగుతాం, డబ్బులు ఇస్తే తీసుకుటాం.. ధర్మాన్ని గెలిపిస్తామని చెప్పాలని ఓటర్లకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు..