InternationalNews

ఆసీస్‌పై కివీస్‌ భారీ గెలుపు

సిడ్నీలో ట్వంటీ20 సూపర్‌ 12 తొలి పోరు

న్యూజిలాండ్‌ 3 వికెట్లకు 200 పరుగులు

111 పరుగులకే ఆలౌట్‌ అయిన ఆస్ట్రేలియా

ట్వంటీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో శనివారం జరిగిన సూపర్‌ 12 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. సొంత గడ్డపై మ్యాచ్‌ ఆడుతున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌ 89 పరుగులతో అనూహ్య ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ ఆరంభంలోనే తడబడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే ఆందోళనలో వరుసగా వికెట్లు సమర్పించుకోవడంతో 17.1 ఓవర్లలోనే 111 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌ అయింది. తొలి 8 ఓవర్లలో 54 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోవడం విశేషం. ఆసీస్‌ ఆటగాళ్లు ఏ దశలోనూ క్రీజ్‌లో నిలబడలేకపోయారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 2.1 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. శాన్‌టర్న్‌ కూడా మూడు, బౌల్ట్‌ రెండు వికెట్లు తీశారు.

58 బంతుల్లోనే 92 పరుగులు చేసిన దేవాన్‌ కాన్వే

ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మెరుగు వేగంతో బ్యాటింగ్‌ చేసిన దేవాన్‌ కాన్వే 92 పరుగులు చేయడంతో న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 200 పరుగులు సాధించింది. తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించిన కివీస్‌ ఆటగాళ్లు 16 బంతుల్లోనే 42 పరుగులు చేయడం విశేషం. చూడముచ్చటైన బ్యాటింగ్‌ విన్యాసాలు ప్రదర్శించిన కాన్వే 58 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై గెలిచి సత్తా చాటాలన్న కసి న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో కనబడింది.