InternationalNews

భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వాన గండం.. ఆందోళనలో ఫ్యాన్స్‌

ట్వంటీ20 వరల్డ్‌ కప్‌లో ఆదివారం భారత్‌, పాక్‌ మ్యాచ్‌

మెల్బోర్న్‌లో వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ

బ్యాటింగ్‌లో భారత్‌.. బౌలింగ్‌లో పాక్‌ పటిష్టం

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ట్వంటీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు వాన గండం పొంచి ఉంది. సూపర్‌ 12లో భాగంగా ఆదివారం జరిగే ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ.. మెల్బోర్న్‌లో ఆదివారం భారీ వర్షం పడుతుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. 1 మిల్లీ మీటర్‌ నుంచి 5 మిల్లీ మీటర్ల వర్షం కురిసే అవకాశం 80-90 శాతం వరకు ఉందని అంచనా వేసింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొన్నది. దీంతో క్రికెట్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

నెల రోజుల ముందే టికెట్ల విక్రయం..

ఈ మ్యాచ్‌కు టికెట్లన్నీ నెల రోజుల ముందే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా మెల్బోర్న్‌లోని ఎంసీజీ గ్రౌండ్‌కు పేరుంది. భారీ వర్షం కురిస్తే మ్యాచ్‌ రద్దు చేయాల్సి వస్తుంది. మోస్తారు వర్షం పడితే మ్యాచ్‌ను కుదించి నిర్వహిస్తారు. విక్టోరియా రాష్ట్ర క్రికెట్‌ సంఘం నిబంధనల ప్రకారం మ్యాచ్‌ రద్దయితే టికెట్ల పూర్తి ధరను తిరిగి చెల్లిస్తారు. స్టేడియంలో, టీవీల్లో యాడ్స్‌ ఆదాయాన్ని కూడా క్రికెట్‌ సంఘం కోల్పోవాల్సి వస్తుంది.

ఇక జట్ల విషయానికి వస్తే భారత జట్టు బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. రోహిత్‌ శర్మ, రాహుల్‌, కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కార్తీక్‌ కూడా రాణిస్తున్నారు. అయితే.. బౌలర్ల విషయంలో జట్టు ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో పరుగులను కట్టడి చేయగలిగే బౌలర్లు కరువయ్యారు. బౌలింగ్‌ను కట్టుదిట్టంగా వేయగలిగితే ప్రపంచ కప్‌ను భారత్‌ సునాయాసంగా గెలుస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాక్‌ జట్టులో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, ఓపెనర్‌ రిజ్వాన్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. క్రీజ్‌లో నిలదొక్కుకుంటే వీళ్లను అవుట్‌ చేయడం ఎవరి తరమూ కాదు. బౌలింగ్‌ విషయంలో భారత్‌ కంటే పటిష్టంగా ఉండటం పాక్‌కు కలిసొచ్చే విషయం.