NewsTelangana

అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలి.. ఎంత చేస్తున్నారు..

మునుగోడులో రూ.150 కోట్లు దాటిన ఆ రెండు పార్టీల ఖర్చు

విందులు, వినోదాలు, తాయిళాలకు లక్షల్లో చేస్తున్న ఖర్చు

నామమాత్రంగా తిరుగుతున్న ఎన్నికల సంఘం పరిశీలకులు

పార్టీలు, అభ్యర్థులు ఇచ్చే లెక్కలనే రికార్డుల్లో రాస్తున్న వైనం

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గరిష్టంగా రూ.40 లక్షలు ఖర్చు చేయాలి. చిన్న రాష్ట్రాల్లో అయితే రూ.28 లక్షల వరకు ఖర్చు చేయాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఒక అభ్యర్థి గరిష్టంగా రూ.95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.75 లక్షల వరకు ఖర్చు చేయాలి. కానీ.. మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థులు పెడుతున్న ఖర్చును చూస్తే దిమ్మ తిరుగుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేపీల ఖర్చు ఇప్పటికే రూ.150 కోట్లు దాటిందని ఓ సర్వేలో తేలింది. ఎన్నికలకు ఇంకా 12 రోజుల సమయం ఉంది. అసలైన ఖర్చును పార్టీలు ఎన్నికలకు ఒకట్రెండు రోజుల ముందే చేస్తారు. వివిధ పార్టీలు చేస్తున్న ఖర్చులపై ఓ కన్నేద్దాం..

ఈ ఎన్నికల్లో బంగారమూ పంచుతున్నారు..

గతంలో ఎన్నికలంటే డబ్బులు, మద్యం పంపిణీ మాత్రమే ఉండేది. మునుగోడు ఉప ఎన్నికను ఇటు బీజపీ, అటు టీఆర్‌ఎస్‌, మరోవైపు కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బంగారంతో కూడా ఓటర్లను కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బంగారం పంచుతున్నట్లు వార్తలొస్తున్నాయి. విందులు, వినోదాలు, తాయిలాలకు మాత్రం కొదవలేదు. చౌటుప్పల్‌, మునుగోడులో బతుకమ్మ పండుగ కోసం వచ్చిన మహిళలకు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి రూ.500 చొప్పున చెల్లించారు. 4 వేల మంది చొప్పున ఆ రెండు చోట్ల 8 వేల మంది మహిళలు పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, మండలాల్లో టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రతి చోట 8 వేల మందికి ఏర్పాటు చేసిన విందుకు లక్షల్లోనే ఖర్చు చేశారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీ రూ.75 కోట్లు చొప్పున ఖర్చు..

చండూరులో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని పార్టీల అభ్యర్థులు బిర్యానీ ప్యాకెట్‌, క్వార్టర్‌ మందు బాటిల్‌తో పాటు రూ.500 ఇచ్చి పంపించారు. ఇక మద్యం అయితే ఏరులై పారింది. చౌటుప్పల్‌, నారాయణపురం, రామన్నపేట్‌ మండలాల్లో ఆగస్టు, సెప్టెంబరు నెలలతో పాటు అక్టోబరు 10వ తేదీ వరకు రూ.44.5 కోట్ల లిక్కర్‌, బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్కో సర్పంచ్‌కు రూ.20-30 లక్షలు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు రూ.10-15 లక్షలు ఇచ్చి తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రతి బూత్‌కు టీఆర్‌ఎస్‌ రూ.10 వేలు ఇచ్చినట్లు సమాచారం. ఇలా టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇప్పటికే రూ.75 కోట్లు చొప్పున ఖర్చు చేశాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.

బహిరంగ సభలకు భారీగానే ఖర్చు..

ప్రధాన పార్టీలు నిర్వహించిన సభలకైతే కోట్లలోనే ఖర్చవుతోంది. మునుగోడులో సెప్టెంబరు 20న కేసీఆర్‌, 21న అమిత్‌ షా నిర్వహించిన బహిరంగ సభలకు రూ.60 కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి వరకు ఇంచార్జిలను నియమించింది. ఒక్కొక్కరి వెంట ప్రచారానికి 25-30 మంది వచ్చారు. వాళ్లకు భోజనాలు, రవాణా ఖర్చులు లక్షల్లోనే అవుతున్నాయి. కుల సంఘాల సమావేశాలకూ లక్షల్లోనే ఖర్చు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు మున్సిపాలిటీలు, మండలాల వారీగా నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలు, వన భోజనాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

నామమాత్రంగా ఈసీ పరిశీలకులు..

పోలింగ్‌కు ఇంకా 12 రోజుల సమయం ఉంది. అప్పటి వరకు ప్రధాన పార్టీలు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తారో.. ఈ ఖర్చు లెక్కలను అభ్యర్థులు ఎలా చూపిస్తారో చూడాలి. అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల పరిశీలకులు నిఘా పెడతారు. డబ్బులు చేతులు మారకుండా, మద్యం సరఫరా కాకుండా ఈ పరిశీలకులు వీడియో సర్వే లెన్స్‌, వీడియో రివ్యూ టీమ్స్‌, అకౌంటింగ్‌ టీమ్స్‌, కంప్లైంట్‌ మానిటరింగ్‌ టీమ్స్‌, కాల్‌ సెంటర్‌ మానిటరింగ్‌ టీమ్స్‌ పనిచేస్తున్నాయి. మీడియాలో పెయిడ్‌ న్యూస్‌ ఖర్చుల వివరాలూ సేకరిస్తున్నారు. అయితే.. మునుగోడులో వీళ్లంతా నామమాత్రంగానే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీల విచ్ఛలవిడి ఖర్చును ఎక్కడా అడ్డుకోవడం లేదని, పార్టీలు, అభ్యర్థులు ఇచ్చే మొక్కుబడి లెక్కలను మాత్రమే రికార్డుల్లో రాస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.