NewsTelangana

మునుగోడులో టీఆర్‌ఎస్‌ బెదిరిస్తోందా..?

మునుగోడు, అక్టోబరు 15(మనసర్కార్‌): ఉప ఎన్నిక జరగనున్న మునుగోడులో ఏం జరుగుతోంది..? ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తారన్న ప్రజా గాయకుడు గద్దర్‌ ఎందుకు వెనక్కి తగ్గారు..? పది రోజుల క్రితమే పార్టీలో చేరిన ప్రజా యుద్ధ నౌక గద్దర్‌కు కేఏ పాల్‌తో చెడిందా..? కేఏ పాల్‌ చెప్పినట్లు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు గద్దర్‌ను బెదిరించారా..? నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారా..? అందుకే గద్దర్‌ వెనకడుగు వేశారా..? నామినేషన్‌ వేయకుండా కేఏ పాల్‌కు సైతం అధికారులు, పోలీసులు అడ్డంకులు సృష్టించారా..?

గద్దర్‌కు ప్రజల్లో ఆదరణ..

నిజానికి.. మునుగోడులో కమ్యూనిస్టులను అభిమానించే ప్రజలు చాలా ఉన్నారు. వామపక్షాల ఓటు బ్యాంకు వేలల్లోనే ఉంది. ఈ నియోజక వర్గం నుంచి కమ్యూనిస్టు అభ్యర్థి ఏకంగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం సీపీఐ, సీపీఎంలు అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నాయి. దీంతో కమ్యూనిస్టు అభిమానులంతా గంపగుత్తగా తమకే ఓటేస్తారని టీఆర్‌ఎస్‌ ఆశిస్తోంది. మరోవైపు ప్రజా గాయకుడిగా గద్దర్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. గద్దర్‌ పోటీ చేస్తే పార్టీతో నిమిత్తం లేకుండా వామపక్ష భావజాలం కలిగిన ప్రజలు, కమ్యూనిస్టు పార్టీని అభిమానించే వారు ఆయనకే ఓటేసే అవకాశం ఉంది. అప్పుడు టీఆర్‌ఎస్‌ విజయావకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.

ఇది ప్రజాస్వామ్య దేశమేనా..?

అందుకే కేఏ పాల్‌ ఆరోపిస్తున్నట్లు గద్దర్‌ను టీఆర్‌ఎస్‌ నాయకులు బెదిరించారా..? నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారా..? ఒకానొక సమయంలో ప్రజల కోసం ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా మావోయిస్టు పార్టీలో పనిచేసిన గద్దర్‌.. ఇప్పుడు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు లొంగిపోయారా..? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు మునుగోడు ప్రజలను వెంటాడుతున్నాయి. అదే నిజమైతే.. ఇది ప్రజాస్వామ్య దేశమేనా.. అని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అధికార పార్టీ ఇంకా ఎన్ని అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థులకు, ఓటర్లకు ఇబ్బంది కలగరాదు..

గద్దర్‌ ప్రజాశాంతి పార్టీలో చేరిన తర్వాత తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాంను కలిశారని.. మరికొందరు నేతలు, శ్రేయోభిలాషులు కూడా గద్దర్‌కు సలహాలు, సూచనలు చేశారని వార్తలొచ్చాయి. వాళ్ల సూచన మేరకే గద్దర్‌ వెనక్కి తగ్గారా.. అనే అనుమానం కూడా తలెత్తుతోంది. అయితే.. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే పింఛన్లు ఇస్తామంటూ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులను సైతం అధికార పార్టీ నాయకులు నిలిపివేశారని ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దానిపై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. కేఏ పాల్‌ తాజా ఆరోపణల నేపథ్యంలో ప్రచార సమయంలో అభ్యర్థులకు, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మునుగోడు ప్రజలు అంటున్నారు.