మానవ హక్కుల రక్షణకే నోబెల్ శాంతి బహుమతి
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ముగ్గురికి దక్కింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది శాంతి నోబెల్ బహుమతికి ప్రాధాన్యత ఏర్పడింది. బెలారస్ న్యాయవాది, హక్కుల ఉద్యమకారుడు అలెస్ బిలియాట్స్కీ, రష్యా మానవ హక్కుల సంస్థ (హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్), ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌లను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం కోసం అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తుగానే వారిని ఇలా గౌరవించుకున్నామని నోబెల్ అవార్డుల కమిటీ చైర్మన్ బెరిట్ రైస్ అండర్‌సెన్ తెలిపారు. ప్రస్తుతం జైల్లో ఉన్న అలెన్ బిలియాట్స్కీని తక్షణమే విడుదల చేయాలని బెలారస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విజేతలకు ప్రైజ్ మనీ కింద 10 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు(9 లక్షల డాలర్లు) ఇస్తారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి అయిన డిసెంబరు 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు.