NationalNews

ఏఐసీసీ చీఫ్‌గా ఖర్గేకు గెలుపు లాంఛనమేనా?

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మల్లికార్జున ఖర్గే
సోనియా, రాహుల్ మద్దతు ఖర్గేకే
రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఖర్గే

గాంధీ కుటుంబం ఏఐసీసీ చీఫ్‌గా మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపినట్టుగా తెలుస్తోంది. దీంతో నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఖర్గేతో బరిలో శశి థరూర్ మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్‌ ‘ఒకే వ్యక్తి, ఒకే పదవి’ నిబంధనకు అనుగుణంగా ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ ఇద్దరూ ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్‌ను దాఖలు చేస్తారు. నామినేషన్ పత్రాలను సేకరించిన దిగ్విజయ సింగ్… ఖర్గేతో సమావేశం తర్వాత పోటీ నుండి తప్పుకున్నారు. అర్థరాత్రి సమావేశం తరువాత, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, ఖర్గేను పోటీ చేయాలని నాయకత్వం కోరుకుంటోందని.. మొత్తం వ్యవహారంలో గాంధీ కుటుంబ సభ్యులు తటస్థంగా ఉంటారని చెప్పినట్టు తెలుస్తోంది.

సంస్థాగత మార్పులను కోరుతూ 2020లో సోనియా గాంధీకి లేఖను పంపిన “G-23” అసమ్మతివాదుల సమూహంలో కీలక సభ్యుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా… ఖర్గేకు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విధేయులు రేపిన రచ్చతో హైకమాండ్ నుంచి చీవాట్లు అందుకున్న తర్వాత తిరుగుబాటుకు సంబంధించి సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పడం.. రేసు నుండి తప్పుకోవడం జరిగిపోయాయ్. 2020లో తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా గెహ్లాట్ స్థానంలో అంగీకరించబోమని ఆయన విధేయులు తేల్చిచెప్పడంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. వాస్తవానికి గెహ్లాట్ నమ్మినబంటుగా ఉంటాడని… గాంధీ కుటుంబానికి వీరవిదేయుడిగా ఉంటారని అందరూ భావించారు.

ఐతే గెహ్లాట్ తిరుగుబాటు తర్వాత… రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గెహ్లాట్‌ను కొనసాగిస్తారా లేదా అన్నదానిపై సోనియా గాంధీ త్వరలో తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహ్లాట్ విధేయులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరించింది. పార్టీ అంతర్గత విషయాలపై మీడియా ముఖంగా మాట్లాడితే సహించబోమని తేల్చిచెప్పింది. 20 ఏళ్ల తర్వాత గాంధీయేతరులు పోటీలో ఉండటం ఇదే తొలిసారి.