ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు ‘బంధు’లు గుర్తుకొస్తాయి..
రాష్ట్రంలో ఎన్నికలొస్తేనే సీఎం కేసీఆర్‌కు దళిత బంధు, గిరిజన బంధు గుర్తుకొస్తాయని.. ఎన్నికలు లేకుంటే ఎవరినీ పట్టించుకోరని బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ మాయల మరాఠ, బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని ప్రజలే అంటున్నారని ఎద్దేవా చేశారు. గురువారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజక వర్గం రాణిపేటలో ఈటల విలేకరులతో మాట్లాడారు. బీజేపీ భరోసా యాత్రలో భాగంగా తిరుగుతుంటే ప్రజల నుంచి చాలా అభ్యర్థనలు వస్తున్నాయన్నారు.

57 ఏళ్లకే పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తానన్న కేసీఆర్ ఎవరికి ఇచ్చారో తెలియడం లేదన్నారు. ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని రైతులను ఎగవేతదారులుగా మార్చారని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.3116 భృతి ఏమైందని అడిగారు. మహిళల రుణాలకు వడ్డీ చెల్లించేందుకు మూడేళ్లుగా రూ.3750 కోట్లు విడుదల చేయకపోవడంతో మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారని వివరించారు.

అబద్ధాల కోరు కేసీఆర్‌ను ఎవరూ నమ్మడం లేదని, ఆయనకు ఇంత కోపం ఎందుకని ప్రజలు తనను అడుగుతున్నారని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్‌పై భ్రమలు తొలగిపోయాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తామని గ్రామీణ ప్రజలు అంటున్నారని తెలిపారు. బీజేపీని నిండు మనసుతో ఆశీర్వదించాలని, ప్రధాని మోదీ అండతో మంచి భవిష్యత్తు ఉన్న తెలంగాణాను అందిస్తామని చెప్పారు. కామారెడ్డిలో భూదందాను కలెక్టర్ అరికట్టాలన్న డిమాండ్‌తో బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఈటల విరమింపజేశారు. 3 రోజులుగా దీక్ష చేస్తున్న రమణారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను సముదాయించి నిమ్మరసం ఇచ్చారు.