రాజస్థాన్ వదలి వచ్చేయండి… గెహ్లాట్‌కు కాంగ్రెస్ క్లారిటీ
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పార్టీ పెద్దలు ఇప్పటికే సిద్ధం చేసారు. పార్టీకి విధేయుడిగా ఉన్న గెహ్లాట్.. ఏఐసీసీ చీఫ్ పోస్టుకు వందకు వంద శాతం కరెక్ట్ అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో రాజస్థాన్ సీఎం పీఠం విషయంలో ఆయనకున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో మరోసారి గెలవాలంటే అది గెహ్లాట్ వల్ల కాదని.. అందుకు యువనేత సచిన్ పైలట్ అవసరమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే చాన్నాళ్ల క్రితమే పార్టీ పెద్దలతో లొల్లి పెట్టుకొని ఢిల్లీకి వచ్చిన పైలట్ విషయంలో కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం ఫుల్ క్లారిటీ ఉంది. మొత్తంగా రాజస్థాన్ సీఎం పదవికి త్వరలోనే గెహ్లాట్ రాజీనామా చేయడం ఖాయంగా కన్పిస్తోంది.

గెహ్లాట్ ఏఐసీసీ చీఫ్ ఎంపికయ్యాక రెండు పదవులు నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అంతే కాదు.. ఒక వ్యక్తికి ఒక పదవేనంటూ రాహుల్ గాంధీ తేల్చిచెబుతున్నారు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలోనూ వన్ పర్సన్.. వన్ పోస్ట్ నినాదాన్ని పార్టీ ఆమోదించింది. ఎలా చూసినా గెహ్లాట్ ఏఐసీసీ చీఫ్ గా ఉంటూ రాజస్థాన్ సీఎంగా ఉండటం సాధ్యం కాదన్న భావనలో ఆ పార్టీ ఉంది. అందుకే మొత్తం వ్యవహారాన్ని గెహ్లాట్‌కు విడమర్చి చెప్పి… పార్టీకి ఇబ్బందికలక్కుండా ఉండాలని కోరుతోంది. దీంతో మొన్నటి వరకు రెండు మూడు పదవులైనైనా అలవోకగా నిర్వర్తిస్తానంటూ బీరాలు పలికిన గెహ్లా్ట్ ఇప్పుడు రాజస్థాన్ సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఉన్నప్పటికీ… ఆ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారడం లేదు.

కేవలం రాజస్థాన్ అంశం మాత్రమే కాంగ్రెస్ పెద్దలను కలవరపరుస్తోంది. రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానంటూ గెహ్లాట్ చెప్పడం వెనుక ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆయనకు ఉన్న పట్టు నేపథ్యంలో… సీఎం పీఠాన్ని వదులుకోడానికి ఇష్టం లేదన్న వర్షన్ విన్పించడం ద్వారా తనకు ఆమోదయోగ్యమైన, నమ్మకమైన వ్యక్తిని రాజస్థాన్ సీఎం పీఠంపై కూర్చోబెట్టొచ్చని గెహ్లాట్ భావిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సీపీ జోషీ, బ్రహ్మణ వర్గానికి చెందిన నాయకుడిగా రాష్ట్రంపై గట్టి పట్టు ఉంది. ఆయనకు సీఎం పీఠం ఇవ్వాల్సిందిగా గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరుతున్నారు. సోనియాగాంధీతో రెండు గంటల సమావేశంలో ఇదే విషయంపై గెహ్లాట్ క్లారిటీ కోరగా… ఆమె పైలట్ విషయాన్ని సుతిమెత్తగా చెప్పినట్టు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికలకు ముందు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లో తన మార్క్ ఉంటేనే గెలుపు సాధ్యమవుతోందన్న వర్షన్ ఆయన సోనియాకు విన్పించారు. రాజస్థాన్ అసెంబ్లీకి 2019 జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయ్. నెల రోజులు ముందుగా అంటే 2023 డిసెంబర్‌లో మళ్లీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. అంటే లోక్ సభ ఎన్నికల కంటే ఆరు నెలల ముందు అక్కడ ఎన్నికలు జరిగుతాయ్. కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టంగా మారుతున్న ఎన్నికలు రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో ప్రతికూలంగా ఉండరాదని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తోంది. పంజాబ్‌లో సిద్దూ మొండిపట్టుదలతో ఆ రాష్ట్రాన్ని కోల్పోయామని హస్తం నేతలు భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎలాంటి సమస్యలు కలక్కుండా చూసుకోవాలని పార్టీ నేతలు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. గెహ్లాట్ వర్సెస్ థరూర్ ఘర్షణ వ్యవహారం పెద్ద సమస్య కాదని… గెహ్లాట్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపైనే అసలు ట్విస్ట్ కన్పి్స్తోంది. రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉందంటున్నారు గెహ్లాట్.

