జింఖానా గ్రౌండ్లో ఉద్రిక్తత… ఫ్యాన్స్‌కు తీవ్ర గాయాలు… ఒకరి పరిస్థితి విషమం
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25న జరిగే ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం నగరంలోని జింఖానా గ్రౌండ్లో టికెట్ విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే.. టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో బారులుతీరారు. భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు తరలి వచ్చారు. ఒక్కసారిగా టికెట్ల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీకి పని చెప్పారు. పోలీసుల లాఠీచార్జ్‌లో కూడా పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలో నలుగురు తీవ్రంగా గాయపడగా… 20 మందికి పైగా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో అభిమానులతోపాటు 10 మందికి పైగా పోలీసులు సైతం గాయాల పాలయ్యారు. గాయాలపాలైన వారిలో యువతులు కూడా ఉన్నారు. గాయాలైన వారికి యశోద ఆసుపత్రికి తరలించారు.

హెచ్‌సీఏ తీరుపై విమర్శలు…
ఇదిలా ఉండగా టికెట్ల విక్రయాలపై హెచ్‌సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వస్తారని అంచనాలున్నా అందుకు తగ్గట్లుగా హెచ్‌సీఏ సరైన ఏర్పాట్లు చేయలేదు. టికెట్ల విక్రయాల్లో దారుణంగా విఫలమైంది. దాదాపు 10 వేల మంది టికెట్ల కోసం వస్తే… వారికి కేవలం నాలుగు క్యూలైన్లు మాత్రమే పెట్టారు. మహిళలకు ప్రత్యేక కౌంటర్ లేదు. వేలాది టికెట్లను ఒక్క గ్రౌండ్‌లోనే విక్రయించడమేంటని.. నగరంలోని వేరు వేరు ప్రాంతాల్లో సేల్స్ చేయొచ్చు కదా? అని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల విక్రయాల కోసం నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటర్ల వద్ద ఆన్లైన్ పేమెంట్లకు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కార్డులు, యూపీఐ పేమెంట్లను అధికారులు అనుమతించలేదు. కేవలం క్యాష్ పేమెంట్లతో టికెట్లు విక్రయించారు. హెచ్‌సీఏ అధికారుల తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు వీఐపీ పాస్‌ల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉండటంతో హెచ్‌సీఏ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారనే వార్తపై నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ ఖండించారు. తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. తోపులాటలో మహిళకు గాయాలయ్యాయని. ప్రస్తుతం ఆమె యశోద హస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని డీసీపీ స్పష్టం చేశారు. హెచ్‌సీఏ నిర్లక్ష్యం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగిందన్నారు. నిర్వహణా లోపం కారణంగానే… పరిస్థితులు అదుపు తప్పాయని వెల్లడించారు. హెచ్‌సీఏపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు.. టికెట్ల విషయంలో తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో చెప్పాలన్నారు. బ్లాక్ దందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రికెట్ మ్యాచ్ టికెట్ల విషయంలో తెలంగాణ పరువు తీయొద్దన్నారు మంత్రి.