NationalNews Alert

అక్షయ్ కుమార్ యాడ్‌పై దుమారం

‘తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందంటారు’ పెద్దలు. కొన్ని మంచి ఉద్దేశంతో చేసిన పనులు కూడా విమర్శల పాలవుతూ ఉంటాయి. పాపం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చేసిన ఒక యాడ్‌పై ఇలాంటి దుమారమే రేగింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మరణించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం నింపే ఉద్దేశంతో ఓ యాడ్ ఫిల్మ్ రూపొందించారు. అందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించాడు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ దీనిని ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్న కారు సురక్షితమనే సందేశం ఉంది.

ఈ యాడ్‌లో ఏముంది?

ఈ యాడ్‌లో వివాహం అనంతరం కుమార్తెను,అల్లుడిని రెండు ఎయిర్ బ్యాగులున్న కారులో పంపిస్తూ ఉంటారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ వేషంలో ఉన్న అక్షయ్ కుమార్ ఇలాంటి వాహనంలో అమ్మాయిని అత్తారింటికి పంపుతారా అని తండ్రిని ప్రశ్నిస్తారు. ఆరు ఎయిర్ బ్యాగులున్న కారు సురక్షితమని అక్షయ్ చెప్పడంతో కొత్తజంట అలాంటి కారు ఎక్కి ఆనందంగా వెళ్లిపోతారు. అయితే ఈ యాడ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాడ్ వరకట్నాన్ని ప్రోత్సహించేదిగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారుల లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటే ఖరీదైన ఆరు ఎయిర్ బ్యాగులున్న కారులో వెళ్లమని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. శివసేన నాయకురాలు ప్రియాంకా చతుర్వేది, టిఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే వంటి వారు ఈ యాడ్‌పై మండి పడుతున్నారు.