NewsNews AlertTelangana

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

జర్నలిస్టులకు శుభవార్త. హైదరాబాద్‌లో 14 ఏళ్లుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీలోని వెయ్యి మందికి పైగా సభ్యులకు నిజాంపేట్‌, పేట్‌ బషీర్‌బాగ్‌లో ప్రభుత్వం కేటాయించిన 70 ఎకరాల్లో ఇళ్లు కట్టుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో నిర్మాణాలకు, ప్లాట్ల కేటాయింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది.

`అతి తక్కువ వేతనాలతో ఇబ్బంది పడే జర్నలిస్టులకు సొంత ఇళ్లు కూడా ఉండకూడదా? ఆ స్థలం కోసం జర్నలిస్టు సొసైటీ ప్రభుత్వానికి ఇప్పటికే రూ.1.33 కోట్లు డిపాజిట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ప్లాట్ల కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నాను` అని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ తన తీర్పులో వెల్లడించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రజాప్రతినిధులకు ప్లాట్ల కేటాయింపు విషయాన్ని వేరే బెంచ్‌ చూసుకుంటుందని స్పష్టం చేశారు. చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ రిటైర్మెంట్‌కు ఒక రోజు ముందు ఇచ్చిన ఈ తీర్పుపై తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు ఆనందం వ్యక్తం చేశారు. జస్టిస్‌ రమణకు కృతజ్ఞతలు తెలిపారు.