NewsTelangana

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మర్చిపోకూడదు

తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ… స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ… పేదల ఆశలు నెరవేరలేదు.. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదనే ఆవేదన మనకు కనబడుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అనుకున్న విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను గొప్పగా జరుపుకున్నాం. ప్రపంచ మానవాళికి సందేశమిచ్చిన మహాత్మాగాంధీ పుట్టిన గడ్డ మన దేశం. అటువంటి దేశంలో మహాత్మాగాందీ గురించి, స్వతంత్ర పోరాటంలో ఆయన పాత్రపై నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం.

గాంధీ సినిమాను 22 లక్షల మంది చూడడం గొప్ప విషయం. 10 శాతం గాంధీ స్ఫూర్తి నింపుకొన్నా దేశం పురోగమిస్తుంది. గాంధీజీ గురించి ఈతరం పిల్లలకు తెలియాల్సిన అవసం ఉంది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మర్చిపోకూడదు అని సీఎం కేసీఆర్‌ వివరించారు. ప్రాణ, ఆస్తి త్యాగాలు, అమూల్యమైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చింది. స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం.

సామూహిక జాతీయ గీతాలాపనలో సుమారు కోటి మంది పాల్గొన్నారు. ఏకకాలంలో ఆలపించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని సీఎం పేర్కొన్నారు. మహాత్ముడు విశ్వమానవుడు. ఆయన గొప్ప తనాన్ని యూఎన్‌వో ప్రశంసించింది. అంతర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్‌ గ్రేట్‌ అని పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. గాంధీగారి జీవిత విశేషాలు, విగ్రహాలు… విదేశాల్లో ఉన్నాయంటే భారతదేశానికి గర్వకారణం అని సీఎం కేసీఆర్‌ అన్నారు.