సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి ఘటన ఎవరి పని..?
ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్ పరిసరాలు ఒక్కసారిగా అట్టుడికాయ్… నేరాలు… ఘోరాలు జరగని ఆ ప్రాంతం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోంది. నిత్యం వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే జంక్షన్ ఒక్కసారిగా జామ్ అయిపోయింది. వేలాది మంది జీవితాలకు జీవనాధారమైన ఆ ప్రాంతం.. అల్లర్లతో ఒక్కసారిగా అట్టుడికిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి యువత ఒక్కసారిగా చొరబడటం… స్టేషన్‌లోని పార్సిల్ సెక్షన్లో అనేక మంది ప్రజలకు సంబంధించిన వస్తువులను ట్రాక్‌పై పడేయడం… వాటిని కూల్చి బూడిద చేయడం చిన్న విషయమనుకుంటే పొరపాటే… దానికి కర్త, కర్మ, క్రియ మరెవరూ ఉన్నారని ఇట్టే తెలిసిపోతోంది…

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల కోసం యువత ఎనిమిదేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉంది. ఎందు కోసమైతే తెలంగాణ ఏర్పాటయ్యిందో… ఆ లక్ష్యం సిద్ధించనూ లేదు. యువత నేటికి బలిదానాలు చేస్తూనే ఉంది. ప్రజలకు ఇచ్చిన మాటలను తప్పి… ఇష్టానుసారం పాలిస్తున్న టీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెబుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఆశాదీపంగా కన్పిస్తోంది కమల దళం… ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్, హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. తెలంగాణలో ప్రజలకు డబుల్ ఇంజిన్ గ్రోత్ సత్తా చూపిస్తామంటూ బీజేపీ అగ్రనేతలు గత కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలోనూ తెలంగాణ ప్రజలు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని… వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కూడా తేల్చి చెప్పారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేరడం లేదని… కుటుంబపాలన పోతేనే ప్రజలు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని కుండబద్ధలు కొట్టారు.

గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణను చూట్టేస్తున్నారు. అటు పార్టీకి, ఇటు తెలంగాణ ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. అంతే కాదు… ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలను వచ్చే నెల 2, 3 తారీఖుల్లో హైదరాబాద్‌లో నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఆ కార్యక్రమానికి బీజేపీ అతిరథ మహారథులంతా రానున్నారు. ప్రధాని, హోం మంత్రి, రక్షణ మంత్రి,కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరేంటి… బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు ఉండనున్నారు. ఇలాంటి తరుణంలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో… అది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లరి మూకల విధ్వంసం వెనుక ఎవరి హస్తం ఉందన్నదానిపై ఎంతో యాంబిగ్విటీ కన్పిస్తోంది. బీజేపీ పెద్దలందరూ హైదరాబాద్ రానున్న సమయంలో దాడులు జరగడం, కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వెనుక ఏదో మతలబు ఉందనిపిస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా… ఆ నిప్పు వెనుక ఉందెవరో తేలాలి.

మొత్తం అల్లర్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. వేలాది మంది రైల్వే స్టేషన్లో ఉన్న తరుణంలో… ఆ నిప్పు ప్రజలకు అంటుంకుంటే… ఆ మంటల్లో సామాన్యులు చిక్కుకుంటే ఏం జరిగేది. కనీసం ప్రజల గురించి ఆలోచించకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. నిరుద్యోగ యువత తెలంగాణలో మొన్నటి వరకు ఎన్ని ఆందోళనలు చేసిందో చూశాం. ఉద్యోగాలు కావాలంటే రోడ్లపైకి వస్తే ఎలా ఈడ్చేశారో చూశాం… ఎందరో నిరుద్యోగులు కళ్ల ముందే బలైతే మౌనంగా చూస్తూ ఉన్నాం. ఇదంతా పక్కనబెట్టి ఇవాళ… నిరుద్యోగ సంక్షోభ తీవ్రత ఇలా ఉందంటూ ఘనత వహించిన మన పాలకులు లెక్చర్లివ్వడం బాధ్యతాయుతమైన పాలకులు చేసే పనేనా? … తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ చేసిందేంటి? మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతుండటంతో ఇప్పుడు నోటిఫికేషన్లంటూ కొత్త జాతర మొదలు పెట్టి… నిరుద్యోగులను మోసం చేసేందుకు చేస్తున్న కపటం ఎవరికి తెలియదు. కేంద్రాన్ని ప్రశ్నించే పెద్దలు… తామేం చేశామో చూసుకోవాల్సిన అవసరం లేదా? అన్నింటినీ రాజకీయం చేసి.. పబ్బం గడుపుకోవాలని చూస్తున్న పాలకులకు ప్రజలు తగిన బుద్ధి కచ్చితంగా చెబుతారు.