కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ
ఇటీవలే ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇప్పుడు పార్టీ విరాళాలకు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను విరాళాల రూపంలో వచ్చిన రూ.199.15 కోట్ల ఆదాయంపై పన్ను మినహాయింపును ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పీలును ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) తోసిపుచ్చింది. ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను 2018 డిసెంబరు 31లోపు దాఖలు చేయాల్సిందని, అయితే కాంగ్రెస్ పార్టీ గడువు ముగిసిన తర్వాత 2019 ఫిబ్రవరి 2న దాఖలు చేసిందని ఐటీఏటీ గుర్తుచేసింది. గడువు ముగిసిన తర్వాత రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 13-ఏలో నిబంధనలను కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని, తద్వారా పన్ను మినహాయింపు పొందే అవకాశం లేదని ఐటీఏటీ తేల్చిచెప్పింది. సెక్షన్ 13-ఏలోని 139 (4బీ) ప్రకారం రాజకీయ పార్టీలు విరాళాల రూపేణా వచ్చిన ఆదాయంపై పన్ను మినహాయింపు పొందాలంటే తప్పనిసరిగా గడువు తేదీ లోపల రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే.. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 12-ఏ కింద స్వచ్ఛంద సంస్థలకు ఆలస్యంగా రిటర్న్స్ దాఖలుకు అవకాశం ఇస్తున్న విధంగానే పార్టీకీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ చేసిన అప్పీలును ఐటీఏటీ తోసిపుచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పార్టీ రూ.14.49 కోట్లను నగదు రూపంలో సేకరించిందని.. వీటిలో చాలామటుకు దాతకు రూ.2వేల చొప్పున పరిమితికి మించి స్వీకరించడం ద్వారా ఐటీ నిబంధనలను ఉల్లంఘించిందని ఐటీఏటీ పేర్కొంది.