మద్యం ముంచిన రాజకీయ భవిష్యత్తు…!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దిశా నిర్దేశం లేక, తీవ్ర రాజకీయ ఒడిదుడుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో పార్టీకి చెందిన కీలక నేతలు ఒకరొకరుగా అరెస్టవుతుండడం తో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఒంటరి అయ్యారు. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల మద్దతు లేకుండా పోవడమే కాకుండా, జాతీయస్థాయిలో కూడా పార్టీకి ఉన్న సంబంధాలు తడిసిమట్టయ్యాయి.తాజాగా, ఈ కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు సహా ఏ ఒక్క పార్టీ కూడా వైసీపీకి మద్దతుగా నిలబడటం లేదు. గత పాలనలో మద్యం శాఖలో జరిగిన అవకతవకలపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాస్తవంగా అవినీతి జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. ఇదే సమయంలో, మద్యం కేసులో జగన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది.రాష్ట్రస్థాయిలో ఒంటరిగా మారిన వైసీపీ, జాతీయస్థాయిలోనూ అనాథగా మిగిలింది. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వైదొలగడం, ఆయన ఇప్పుడు ప్రత్యర్థిగా మారిపోవడం జగన్‌కి భారీ రాజకీయ దెబ్బ. గతంలో జాతీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీతో సమన్వయం కల్పించే బాధ్యత విజయసాయిరెడ్డిదే. ఆయన లేకుండా జగన్‌కి జాతీయ స్థాయిలో రాజకీయ మద్దతు లభించే పరిస్థితి కనిపించడంలేదు.ఇదిలా ఉండగా, మరోవైపు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా వెలుగొందుతున్నారు. గతంలో జాతీయ రాజకీయాల్లో అనేక పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం చంద్రబాబుకు లభించిన విశ్వాసానికి నిదర్శనం. బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు సైతం చంద్రబాబు విషయంలో విమర్శలు చేయకుండా మౌనం పాటిస్తున్నాయి. కానీ అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు, మద్దతు లేదు.ఈ నేపథ్యంలో జగన్ నాయకత్వంలోని వైసీపీకి భవిష్యత్తులో గమనదిశ ఏమిటన్న సందేహం రాజకీయ పరిశీలకుల మధ్య వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల మద్దతు లేకుండా, కేసుల భారం మోస్తూ, వైసీపీ ఎలా ముందుకు సాగుతుంది అనేది ఒక రాజకీయ ప్రశ్నగా నిలిచింది.వైసీపీ ప్రస్తుతం రాజకీయ ఒంటరితనం, నాయకత్వంపై నమ్మక లోపం, మద్దతు కోల్పోవడం, కేసుల భయం వంటి మలిన పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి పార్టీకి కొత్త వ్యూహాలు అవసరమవుతాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.