InternationalNews

రిషీ సునాక్‌కు 100 మంది ఎంపీల మద్దతు.. పోటీలో బోరిస్‌ జాన్సన్‌

బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతి నాయకుడు రిషీ సునాక్‌ ముందంజలో ఉన్నారు. సునాక్‌కు 100 మంది ఎంపీల మద్దతు లభించినట్లు ఆయన మద్దతుదారులు చెప్పారు. దీంతో బ్రిటిష్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడు అయిన రిషి సునక్‌కు టోరీల తరఫున ప్రధాని పదవికి పోటీ పడేందుకు అర్హత లభించింది. మరోవైపు మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా ప్రధాని పదవికి పోటీ పడాలని నిర్ణయించారు. భార్య, పిల్లలతో విహార యాత్రలో ఉన్న జాన్సన్‌ హుటాహుటిన లండన్‌ చేరుకొని కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయనకు ఇప్పటికే 45 మంది ఎంపీలు మద్దతిచ్చారని.. సోమవారం నాటికి 100 మంది ఎంపీల మద్దతు పొందే అవకాశం ఉందని జాన్సన్‌ సన్నిహితులు చెప్పారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని.. ప్రధాని పదవికి పోటీ చేయొద్దని రిషి సునాక్‌ను జాన్సన్‌ కోరినట్లు బ్రిటన్‌ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో బ్రిటన్‌ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారింది.