‘బ్లూటిక్’పై ట్విటర్ యూ టర్న్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న ఇష్టమొచ్చినట్లు ఆడిస్తున్నారు. ప్రకటనల ఆదాయం తగ్గిపోవడంతో ఖాతాదారుల నుంచి నెలవారీ డబ్బులు వసూలు చేసే ప్లాన్‌ను తొలుత రూపొందించారు. ట్విటర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా మార్చి నెలకు 8 డాలర్ల చొప్పున ఫీజు వసూలు చేయనారంభించారు. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ‘బ్లూ టిక్’ కేటాయించడంతో నకిలీ ఖాతాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ప్రముఖ బ్రాండ్లు, కంపెనీలు, వ్యక్తుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి.. 8 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. వాటికి ‘బ్లూ టిక్’ ఉండటంతో అసలు, నకిలీ ఖాతాలను గుర్తించలేక పరిస్థితి గందరగోళంగా మారింది.

ఖాతాదారుల ఆందోళనతో వెనక్కి..
దీనిపై ట్విటర్ ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ‘బ్లూ టిక్’ సర్వీసును ట్విటర్ నిలిపివేసింది. ‘బ్లూ టిక్’ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.719 చెల్లించాలని భారత్‌లో.. 8 డాలర్లు చెల్లించాలని ఇతర దేశాల్లో ట్విటర్ యూజర్లకు వచ్చిన సందేశం మధ్యాహ్నానికి మాయమైంది. ‘బ్లూ టిక్’ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ కూడా మధ్యాహ్నం నుంచి మాయమైంది. అంటే.. ఇక కొత్తగా ఎవరి ఖాతాలకూ ‘బ్లూ టిక్’ ఇవ్వబోరన్న మాట. ఇంతకాలం ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టులు.. ఇలా ప్రముఖుల ఖాతాలకు వెరిఫై ‘బ్లూ టిక్’ ఇచ్చేవారు.

కొత్తగా అధికారిక ట్యాగ్..
ట్విటర్ మరోవైపు ‘అధికారిక’ అనే ట్యాగ్‌ను కొత్తగా తీసుకొచ్చింది. వెరిఫై చేసిన ఖాతాలకు కింద ఊదా రంగులో official అనే ట్యాగ్‌ను జత చేసింది. ఈ ట్యాగ్‌ను కూడా వారం రోజుల క్రితమే తీసుకొచ్చింది. కానీ.. ఖాతాదారులు అభ్యంతరం చెప్పడంతో అప్పుడు కొన్ని గంటల్లోనే తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదికూడా అమెజాన్, నైక్, కోకకోలా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల ఖాతాలకు మాత్రమే official ట్యాగ్ కనిపిస్తోంది. సెలబ్రిటీలకు, ప్రభుత్వ ఖాతాలకు ఈ ట్యాగ్‌ను ఇంకా జత చేయలేదు. భవిష్యత్తులో వాటికి జత చేస్తారో.. లేదో.. తెలియదు.