బాలీవుడ్, టాలీవుడ్ నటులు, క్రికెట్ సెలబ్రెటీలతో హర్ ఘర్‌కా తిరంగా చూడాల్సిందే
భారత దేశమంతా ఎవరినోట విన్నా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ మాటే. దేశానికి స్వతంత్రం సిద్దించి 75 ఏళ్లు గడుస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో ఇప్పుడు సెలబ్రటీలు కూడా భాగమయ్యారు. భారత దేశ ఐక్యత, గౌరవానికి చిహ్నంగా నిలిచిన మువ్వన్నెల జెండాకు ఈ మధురమైన వందనం అంటూ కేంద్రం ఒక ప్రముఖ గీతాన్ని రూపొందించింది. దీనిలో మన దేశంలోని ప్రఖ్యాత కట్టడాలు, సందర్శక ప్రదేశాలతో పాటు స్వచ్ఛ భారత్, సౌర విద్యుత్, వ్యాక్సినేషన్, సైన్యం విజయాలు, క్షిపణి ప్రయోగాలు వంటివి చూపిస్తూ సోనునిగమ్, ఆశాభోంస్లే ఆలపించారు. ఈ గీతంలో సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా గళం కలిపారు. దీనిలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, వరుణ్ ధావన్, అనుష్క శర్మలతో పాటు దక్షిణాది నటులు ప్రభాస్, కీర్తి సురేశ్‌లు కూడా ఉన్నారు. దీనికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ పాటలో మనం కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, రాహుల్, హార్ధిక్ పాండ్యా, పీవీ సింధు, మేరీ కోమ్, మీరాబాయ్ చాను, మిథాలీ రాజ్ వంటి ప్రముఖ క్రీడాకారులు కూడా ఉన్నారు. వీరంతా జెండా పట్టుకుని హర్ ఘర్ కా తిరంగా అంటూ పాడుతుండగా చిత్రీకరించిన వీడియో అందరినీ కట్టి పడేస్తోంది. ఈ పాటలో ప్రధాని మోదీ కూడా చిన్నారులతో కరచాలనం కూడా చేస్తూ కనిపిస్తారు. ఈ పాటలో ప్రతీ పదంలో దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతుండగా అందరిలో దేశభక్తిని చాటేలా ఉన్న ఈ గీతాన్ని మనమూ చూసేద్దామా..