ప్రయాణికులకు బంపర్ ఆఫర్..5 నిమిషాల్లో టికెట్
బీజీ బీజీగా గడుస్తున్న మన లైఫ్‌లో ఎప్పుడు ఏ ప్రయాణాలు చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. అనుకోని విధంగా చేసే కొన్ని ప్రయాణాలకు ట్రైన్ టికెట్ దొరకక ప్రయాణికులు తెగ ఇబ్బందులు పడుతుంటారు. కానీ.. ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉన్న విషయం మీకు తెలుసా. మీ ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా టికెట్ ను పొందగల సదుపాయం అమలులో ఉన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
టికెట్ బుకింగ్ విషయంలో రైల్వే శాఖ రెండు చార్ట్‌లను సిద్ధం చేస్తుంది. ఈ రెండు ఛార్ట్‌లలో మొదటిది ట్రైన్ బయలుదేరే 4 గంటలకు ముందుగా ప్రీపేర్ చేస్తారు. రెండవ ఛార్ట్‌ను అరగంట ముందు సిద్ధం చేస్తారు. ఇంతకముందు వరకు అరగంట లోపే టికెట్‌ను బుక్ చేసుకునే సదుపాయం కల్పించిన రైల్వే శాఖ ఇక నుంచి ట్రైన్ బయలుదేరే 5 నిమిషాల ముందు కూడా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ విధానం ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక మీదట రైలు బయలుదేరబోయే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్ ను బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.