NewsNews Alert

ప్రజా సంగ్రామ యాత్ర @1000 కి.మీలు

Share with

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం 1000 కిలో మీటర్ల మైలు రాయిని దాటింది. తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడం, వారికి భరోసా ఇవ్వడంతో పాటు కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో తెలంగాణ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మతండా క్రాస్ రోడ్ సమీపంలో 1000 కిలోమీటర్ల మైలు రాయిని దాటడంతో ఈ ప్రాంతంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.

గత ఏడాది ఆగస్టు 28న పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన మొదటి విడత పాదయాత్ర అక్టోబర్ 2న హుస్నాబాద్ లో ముగిసింది. అప్పుడు 36 రోజుల పాటు 19 అసెంబ్లీ , 6 ఎంపీ నియోజకవర్గాలలో 9 జిల్లాల మీదుగా 438 కిలోమీటర్ల మేర నడిచారు.

ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన రెండవ విడత పాదయాత్ర మే 14న తుక్కుగూడలో ముగిసింది. మొత్తం 31 రోజులపాటు 9 అసెంబ్లీ, 3 ఎంపీ నియోజకవర్గాలలో, 5 జిల్లాల మీదుగా 383 కిలోమీటర్ల దూరం నడిచారు.

తాజాగా పాదయాత్ర ఈ నెల రెండవ తేదీన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైంది. 24 రోజుల పాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా, 25 మండలాలలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడో విడత పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడో విడత పాదయాత్ర కొనసాగుతుంది. నేటితో 13 రోజుల పాదయాత్ర చేసి 168.5 కి.మీలు నడిచారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ధర్మతండా సమీపంలో రాత్రి పొద్దుపోయాక వెయ్యి కి.మీల మైలు రాయిని బండి సంజయ్ రాత్రి పొద్దుపోయాక అధిగమించారు. దీంతొో బుధవారం ఉదయం బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున సంబురాలకు సిద్ధమయ్యారు.