NewsTelangana

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి `తిరుగుబావుటా?`

Share with

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్‌ పార్టీలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అనుమానపు చూపులు పెరిగాయి. కాంగ్రెస్‌ ఎంపీ అయిన వెంకట్‌రెడ్డి పార్టీలో కొనసాగడంపైనా ఆ పార్టీ నేతలు డౌట్‌గా ఉన్నారు. ఢిల్లీలో వెంకట్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరును చూస్తే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆయన తిరుగుబావుటా ఎగురవేస్తున్న సూచనలు కనబడుతున్నాయి. పార్టీ నుంచి తననూ వెళ్లగొట్టాలని చూస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై వెంకట్‌రెడ్డి పరోక్ష ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ వాళ్లను బయటికి పంపించేసి తెలుగుదేశం పార్టీ వాళ్లను తీసుకురావాలని చూస్తున్నారని, వారితో పోటీ చేయించాలని కుట్ర పన్నుతున్నారన్నారు. దాసోజు శ్రవణ్‌పైనా అనుమానపు చూపులు చూసేలా కోమటిరెడ్డి చేశారు. దాసోజు వంటి మేధావిని సైతం పార్టీ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పక్కన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎవరైనా ఉన్నారా? అని సూటిగా ప్రశ్నించారు. చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకునే విషయం తనకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు ఎలా నిర్ణయిస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలపై మండిపడ్డారు. వీళ్ల సంగతి సోనియా, రాహుల్‌గాంధీల వద్దే తేల్చుకుంటానని హూంకరించారు. నల్లగొండ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని కితాబిచ్చారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు తెలుసని, అయినా తాను ఇప్పుడే చెప్పబోనన్నారు.