News

అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఫిలిఫైన్స్) సహకారంతో హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు

Share with

అంతర్జాతీయ కామోడీటీస్ సంస్థ, కాలిఫోర్నియా మరియు అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఫిలిఫైన్స్) సంయుక్తంగా ప్రపంచ వరి సదస్సును (Global Rice Summit) ఈ సంవత్సరం జూన్ 4 నుండి 6 వరకు హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన విషయం విదితమే. ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వము భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. ఇలాంటి ప్రపంచ వరి సదస్సును అంతర్జాతీయ కమాడిటీస్ సంస్థ గత 22 సంవత్సరాల నుండి వివిధ దేశాలలో నిర్వహిస్తున్నారు. ఐతే మొట్టమొదటిసారిగా భారతదేశంలో, అదీ మన తెలంగాణ రాష్ట్రములో నిర్వహించడానికి ముందుకొచ్చిన సందర్భము తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు ప్రాముఖ్యతను మరియు విత్తన రంగములో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి హైదరాబాద్ ను ఎంపిక చేయడమైనది. ఈ సదస్సులో 28 దేశాల నుండి దాదాపు 500 మంది ఈ రంగములో విశేష అనుభవమున్న విదేశి ప్రతినిధులు, అనగా శాస్త్రవేత్తలు, వ్యాపారసంస్థల ప్రతినిధులు, ఎగుమతి దిగుమతిదారులు, విద్యావేత్తలు, ప్రభుత్వం రంగములోని వ్యవసాయ పారిశ్రామిక వేత్తలు, వరి అనుబంధ ఉత్పత్తుల రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ వరి సదస్సు ముఖ్య ఉద్ధేశ్యము మన తెలంగాణలో పండే వరికి మరియు వరి ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం ద్వారా డిమాండ్ కల్పించడం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్రంలో వరి సాగును లాభసాటిగా రాష్ట్రరైతాంగ ప్రయోజనాలని పరిరక్షించడం మరియు విత్తన సాగును పెంపొందించి, వాటి ఎగుమతులు ప్రొత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్ధేశ్యము. వరి విత్తనాలకు లభించే ధర, వాణిజ్య పంటకు లభించే ధర కంటే 3 నుండి 4 రేట్లు ఎక్కువ, తద్వారా విత్తన రైతులు అధిక ఆదాయం పొందవచ్చును. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్న వరి రకాలను ప్రదర్శించడం కాకుండా వాటి ప్రాధాన్యతలు వివరిస్తారు. వాటితో పాటు మన దేశీయ వరి విత్తనాలను కూడా అక్కడకు వచ్చే విదేశి ప్రతినిధులకు ప్రదర్శిస్తారు. మనదేశం నుండి బియ్యం ఎగుమతులు 1,77,86,092 టన్నులు (51,088 కోట్లు) కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ఎగుమతులు కేవలం 22,498 మెట్రిక్ టన్నులు (313.61 కోట్లు). అంతేకాక తెలంగాణ రాష్ట్రంనుండి దాదాపు 8000 క్వింటాళ్లు సర్టిఫైడ్ విత్తనాన్ని కూడా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం విధించిన సన్నబియ్యం రకాల ఎగుమతులపై నిషేధం ఫలితంగా సన్నబియ్యం పండించిన రైతులకు కూడా మార్కెట్ లో గిట్టుబాటు ధర రాక వారు కూడా M.S.P ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రంగములోని రైతులు మరియు సంస్థల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక సరళమైన విధానం రూపోందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సదస్సుల ద్వారా కేవలం తెలంగాణలో పండే వరి మరియు విత్తనరంగానికే కాకుండా దేశవ్యాప్తంగా వరిపండించే రైతులందరికి, పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. వివిధ దేశాల నుండి వచ్చేవారి ద్వారా అక్కడ లభించే సదుపాయాలు, సాంకేతక పరిజ్ఞానం, వరి ఉత్పత్తుల తయారికి గల అవకాశాలు, మున్నగునవి మనకు తెలిసే అవకాశం కలదు. మనదేశం నుండి ప్రతి సంవత్సరం దాదాపు 2.26 లక్షల మెట్రిక్ టన్నుల వివిధరకాల వరిధాన్యము 100 దేశాలకు పైగా ఎగుమతి ఉన్నది. ఇది మొత్తం ప్రపంచదేశాలలో ఎగుమతులలో 40శాతం కాబట్టి మన దేశానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ సదస్సులో ఎగుమతి, దిగుమతి దారుల మధ్య ఒప్పందాలు చేసుకొనే అవకాశం గలదు. గత ఏడాది, Cebu, ఫిలిప్పైన్స్ దేశంలో ఈ సదస్సు నిర్వహణ సందర్భములో దాదాపు 20 వరకు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. తదనుగుణంగా ఈ సదస్సులో కేవలం తెలంగాణ రాష్ట్రం సంబంధించి వరి, విత్తనరంగాలు వివిధ ఉత్పత్తుల లభ్యతపై ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుంటకు (రెండు గంటల నిడివిగల) వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతుందని రాష్ట్ర గౌరవమంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు తెలియజేశారు.